
ప్రభుదేవాతో తమన్న
ప్రభుదేవాకు జంటగా తమన్న అనగానే ఇదేదో హింది చిత్రం అనుకునేరు. నృత్య దర్శకత్వం నుంచి, నటన, దర్శకత్వం అంటూ ఎదగడమే కాకుండా తమిళోడి సత్తా ఏమిటన్నది దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు చాటి చెప్పిన కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవా. అయితే ఈయన తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. బాలీవుడ్‌లో దర్శకుడిగా బిజీ అవ్వడంతో తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారనే చెప్పాలి. అయితే ఇటీవల సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించి తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.
మదరాసు పట్టణం, తాండవం, దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రభుదేవా తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. కాగా ఇందులో ప్రభుదేవాతో రొమాన్స్ చేయిం చడానికి నటి తమన్నను ప్రయత్నిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారిక పూర్వకంగా వెలువడే అవకాశం ఉంద ని తెలిసింది.