
పారితోషకం విషయంలో బాలీవుడ్ హిరోయిన్లకి, సౌత్ హీరోయిన్లకి చాలా తేడా ఉంటుంది. బాలీవుడ్‌లో ఒక్క సినిమాకి వచ్చే రెమ్యునరేషన్.. సౌత్‌లో రెండు, మూడు సినిమాలు చేసిన రావు. వందల కోట్ల వసూలు చేసిన సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కూడా పారితోషికం విషయంలో అసంతృప్తిగానే ఉంటున్నారనే అందరికి తెలిసిందే. హీరోలతో పాటు కష్టపడే హీరోయిన్స్ కు ఎందుకు తక్కువ పారితోషికం అంటూ కొందరు ఈమద్య బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ పారితోషికాలు భారీగానే ఉన్నా వారు కూడా తమకు హీరోల స్థాయిలో పారితోషికాలు రావడం లేదంటూ మాట్లాడుతున్నారు. ఈ విషయమై తాజాగా సౌత్ హాట్ బ్యూటీ ప్రియమణి స్పందించింది.
తమ టాలెంట్ కి తగిన పారితోషికం దక్కడం లేదని చాలామంది హీరోయిన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అని ఓ ఇంటర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రియమణి ఊహించని సమాధానం ఇచ్చింది. ‘బాలీవుడ్ విషయం పక్కన పెడితే... సౌత్‌లో మాత్రం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితి నయనతార .. అనుష్క .. సమంతలకు మాత్రమే ఉంది. వాళ్లకి గల డిమాండ్ ను బట్టి తమకి ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని నిర్మాతల నుంచి తీసుకుంటున్నారు. ఇతర హీరోయిన్స్‌కి పారితోషికం డిమాండ్ చేసే అవకాశమే లేదు. అతి కొద్ది మంది మాత్రమే తమకు రావాల్సిన పారితోషికాలను నిర్మాతల నుండి ఖచ్చితంగా వసూలు చేసుకోగలుగుతున్నారు. మిగిలిన వారిలో చాలా మంది కూడా నిర్మాతల వద్ద పారితోషికం విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని ప్రియమణి అభిప్రాయపడింది.
హీరోయిన్ గా తెలుగు.. తమిళంలో పలు చిత్రాలు చేసిన ప్రియమణి ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇటీవలే ఈమె నటించిన 'ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నటనకు గాను ప్రియమణి ప్రశంసలు దక్కించుకుంది.