చెన్నై : ఈనెల 14వ తేదీ నుంచి క్వీన్ పయనం ప్రారంభంకానుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కు ఉన్న డిమాండ్ ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో తలైవి పేరుతో దర్శకుడు విజయ్ ఒక చిత్రాన్ని, నటి నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ది ఐరన్ లేడీ పేరుతో నవ దర్శకురాలు ప్రియదర్శిని చిత్రాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో తలైవి చిత్రం ఇప్పటికే సెట్ పైకి వచ్చేసింది. కాగా వాటితో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్, ప్రసాద్ మురుగేశన్‌లు కలిసి క్వీన్ పేరుతో వెబ్ సీరీస్‌ను రూపొందిస్తున్నారు. జయలలితగా రమ్యకృష్ణ నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. జయలలిత గెటప్‌లో రమ్యకృష్ణ బాగా నప్పిందనే ప్రశంసలు వస్తున్నాయి.
కాగా ఈ క్వీన్ సిరీస్ ప్రసారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి ప్రసారం కానున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా తెగింపు గల నటి, రాజకీయవాది, కాంప్రమైజ్ అనే పదానికి చోటు లేకుండా జీవించిన మనిషిగా రూపొందుతున్న వెబ్ సిరీస్ క్వీన్. బూడిద నుంచి ఉన్నత శిఖరాలకు చేరిన పీనిక్స్ పక్షిలా అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అన్న ఘనతకెక్కి తమిళనాడును ఏలిన వ్యక్తి జయలలిత. ఆమె యదార్థ సంఘటనలతో రూపొందుతున్న సిరీస్ క్వీన్. ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఎంఎక్స్ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ వెబ్ సిరీస్‌తో పాటు జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న చిత్రాలకు జయలలిత సోదరుడి కూతురు దీప అనుమతి ఇవ్వలేదు. అంతే కాదు ఈ వ్యవహారంపై ఆమె కోర్టుకెక్కారు. అయినా క్వీన్ వెబ్ సిరీస్‌ను ప్రసారానికి సిద్ధం అవుతున్నారు. దీంతో సమస్యలు తలెత్తకుండా ఈ సిరీస్‌లో ఎక్కడా జయలలిత పేరును ప్రస్థావం లేకుండా జాగ్రత్త పడ్డారు దర్శక నిర్మాతలు. ఇందులో జయలలిత పాత్ర పేరును శక్తి శేషాద్రి అనే పెట్టారు. అలా చట్ట పరమైన సమస్యలు నుంచి క్వీన్ వెబ్ సిరీస్ బయట పడుతుందా? లేదా?అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment