‘‘విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఘటన బాధాకరం. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను ప్రధాని మోదీగారు నిషేధించాలి’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నారాయణమూర్తి స్పందిస్తూ– ‘‘1985, 1990 దశకంలో భారతదేశంలో పీవీ నరసింహారావుగారు ప్రధానిగా, మన్మోహన్ సింగ్‌గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్‌ఓతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటి. బహుళ జాతి కంపెనీలను, కార్పొరేట్ శక్తులను, ప్రైవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలోకి ఆహ్వానిస్తున్నాం. దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియాకి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన.
బాగా వెనకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఎన్‌డీఏ ప్రభుత్వం చెప్పినా ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిగారు నవరత్నాలను అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులున్నాయా? లేవా? అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించి మానవతను చాటుకున్న జగన్‌గారికి హ్యాట్సాఫ్. నరేంద్ర మోదీగారు ఇప్పటికైనా స్పందించి, జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment