మనకు మనమే..!
‘‘జీవితాన్ని ఎలా తీసుకుంటు న్నాం? అనేదాని మీదే మన మనశ్శాంతి ఆధారపడి ఉంటుంది. అవతలివాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించడం మొదలుపెడితే తిప్పలు తప్పవు’’ అని రాశీ ఖన్నా అంటున్నారు. ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ – ‘‘అందంగా ఉన్నవాళ్లను చూసి, ‘మనం అలా లేం అని అదే పనిగా బాధపడిపోతారు కొంతమంది అమ్మాయిలు. అది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దేవుడిచ్చిన రూపం గురించి ఆలోచించి బాధపడే బదులు మీరు ఎందులో బెస్టో తెలుసుకుని, ‘మనకు మనమే బెస్ట్’ అనుకుని చూడండి.. మీ కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతుంది.
ఒకప్పుడు నేను బొద్దుగా ఉండేదాన్ని. తగ్గితే బాగుంటుందనిపించి తగ్గాను. తగ్గక ముందు ‘నువ్వు లావుగా ఉన్నావు’ అనేవాళ్లు. తగ్గిన తర్వాత ‘ఇంతకుముందే బాగున్నావ్’ అన్నారు. సో.. మనం ఏం చేసినా ఏదో ఒకటి అనడానికి మనుషులు ఉంటారు. అందుకే చెబుతున్నా.. ఎలా ఉంటే బాగుంటుందో మీకు మీరుగా అనుకోండి. ఆ ప్రకారం తగ్గాలో.. పెరగాలో నిర్ణయించుకోండి. ఇతరుల కోసం ఏమీ చేయవద్దు. మన కోసం మనం బతకాలి. ఇతరుల కోసం బతకడం మొదలుపెడితే జీవితంలో రాజీపడాల్సి వస్తుంది’’ అన్నారు. పాయింటే కదా!