సంతోష్ శ్రీనివాస్ ను ఓదార్చిన జూనియర్ ఎన్టీఆర్
మంచి అయినా.... చెడు అయినా ఒకోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోవటం సాధ్యం కాదేమో. అది ఎక్కడైనా...ఎప్పుడైనా సరే మనసులోని భావాలను బయటకు వెల్లడిస్తుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రభస'కు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ...ఆ సినిమా ఆడియో విడుదల సందర్భంగా కంటతడి పెట్టాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్...సంతోష్ శ్రీనివాస్ భుజం తట్టి ఓదార్చారు.
వివరాల్లోకి వెళితే రభస షూటింగ్ సమయంలో సంతోష్ శ్రీనివాస్కు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కామెర్లు (జాండీస్) రావటంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ అందించిన మానసిక ధైర్యం తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్ళు వస్తాయని సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు.
ఓ టాప్ హీరో... దర్శకుడి కోసం మూడు నెలలు ఆగారని దర్శకుడు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సంతోష్ శ్రీనివాస్ వేదికపై కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఆడియో వేడుక అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు జాగ్రత్తలు తెలిపారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని, ఎప్పుడూ చెప్పేదే అయినా... తండ్రి అయిన తర్వాత తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పటం విశేషం.