
ప్రభుత్వాల మాట వినరా ఓరినాయనా.. వెర్రిపప్పలాగా తిరగకురా ఓరినాయనా
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు సినీ కళాకారులు సైతం నడుం బిగుస్తున్నారు. కరోనా వైరస్ పట్ల పాటల రూపంలో ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సంగీతదర్శకులు, గాయకులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పాటల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, కోటి వంటి సంగీత దర్శకులు అందించిన పాటలు ప్రజలను మేల్కొలిపే విధంగా ఉన్నాయని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె మహమ్మారి కరోనాపై ఓ పాట ఆలపించాడు. సిరాశ్రీ సాహిత్యాన్ని అందించాడు.
‘చెప్పినమాట వినకుంటే ఓరినాయనా’అంటూ సాగే ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కొన్ని లిరిక్స్ ప్రభుత్వ సూచనలను పాటించని వారికి నేరుగా గుచ్చుకునే విధంగా ఉన్నాయి. ‘ప్రభుత్వాల మాట వినరా ఓరినాయనా.. వెర్రిపప్పలాగా తిరగకురా ఓరినాయనా’ , ‘దండంబెట్టి చెబుతున్నా ఓరినాయనా.. దండంతో గోడెక్కకు ఓరినాయనా’అనే లిరిక్స్ ఆలోచించే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా డాక్టర్లు చేస్తున్న కృషి, పోలీసుల రక్షణ వంటి విషయాలను పోటలో పొందుపర్చాడు రఘు కుంచె. సాధారణ భాషలో సెటైరికల్‌గా సాగిన ఈపాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా చౌరస్తా బ్యాండ్ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.