కొన్ని సినిమాలు టచ్ చేయకూడదు
‘‘ధనుష్ నటించిన ‘వేలై ఇల్లా పట్టదారి’ చూశాను. నాకు చాలా నచ్చింది. పెదనాన్నగారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొంతమంది ఈ చిత్రాన్ని ఎందుకు రీమేక్ చేయలేదని అడిగారు. కొన్ని సినిమాలను టచ్ చేయకూడదు. అందుకే అనువదించాం. ధనుష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్రతో నేను చాలా కనెక్ట్ అయ్యాను. అనిరుధ్ మంచి పాటలిచ్చారు’’ అని హీరో రామ్ అన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్. వేల్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వేలై ఇల్లా పట్టదారి’ని ‘రఘువరన్ బీటెక్’ పేరుతో నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
‘కొలవెరి..’ ఫేమ్ అనిరుధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రామ్ ఆవిష్కరించి హీరో శర్వానంద్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ -‘‘ధనుష్ చేసే ప్రతి సినిమా వినూత్నంగా ఉంటుంది. ఆయనకు అభిమానిని. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. తమిళంలో లాగా తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ధనుష్ మాట్లాడుతూ -‘‘నేను చాలా ఇష్టపడి చేసిన చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న రవికిశోర్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, ఆయనకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఈ వేడుకలో రవికిశోర్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.