
కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాజ్ తరుణ్
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్, త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జర్నీ సినిమాతో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న జై, అంజలిల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. కొత్త దర్శకుడు సినీష్ దర్శకత్వంలో బెలూన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
హర్రర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, వెంటనే ఈ యంగ్ హీరోను సంప్రదించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో గెస్ట్ అపియరెన్స్లు ఇచ్చిన రాజ్ తరుణ్, బెలూన్ చిత్రానికి కూడా ఓకె చెప్పాడట. ఇప్పటికే రాజ్ తరుణ్ షూటింగ్ కూడా ఫినిష్ చేసాడన్న టాక్ వినిపిస్తోంది. మరి డబ్బింగ్ సినిమాగా రిలీజ్ కానున్న బెలూన్కు రాజ్ తరుణ్ ఎంత వరకు ప్లస్ అవుతాడో చూడాలి.