రాజమౌళి మాట్లాడారు..! | Rajamouli speaks about baahubali team in twitter | Sakshi
Sakshi News home page

రాజమౌళి మాట్లాడారు..!

Published Tue, Mar 28 2017 8:20 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

రాజమౌళి మాట్లాడారు..!

రాజమౌళి మాట్లాడారు..!

బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున సమయం సరిపోక దర్శకుడు రాజమౌళి తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పలేకపోయారు. దాంతో అప్పుడు తాను అనుకున్న మాటలన్నింటినీ ట్విట్టర్‌లో వరుసపెట్టి రాసేశారు. సాంకేతిక సిబ్బంది గురించి వేదికపై పూర్తిగా చెప్పిన రాజమౌళి, నటీనటుల గురించి మాత్రం పెద్దగా ప్రస్తావించలేకపోయారు. దాంతో ఎవరెవరి గురించి అనుకున్నారో.. అన్నింటినీ పేర్కొన్నారు. ముందుగా ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలా మర్యాదపూర్వకంగా అందరినీ హ్యాండిల్ చేసిన జీ4ఎస్ హైదరాబాద్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ మేనేజర్లు అయిన గౌతమ్, విజ్‌క్రాఫ్ట్ మీడియా ఈ కార్యక్రమానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, చాలా విజయవంతం చేసినందుకు వాళ్లకు థాంక్స్ చెప్పారు. గత ఐదేళ్లుగా సమయం సందర్భం లేకుండా తాను ఏం అడిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే అందించిన యోగానంద్, ఆయన బృందానికి ధన్యవాదాలు తెలిపారు. వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్లయితే అసలు వాళ్ల పని కాకుండా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లుగా చేశారని, ఈ త్రిశంకు స్వర్గం నుంచి చాలా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారని అన్నారు.

బాహుబలి చిత్రంలో చేసినందుకు చాలా థాంక్స్ అంటూ స్వీటీ అనుష్కను పొగడ్తలలో ముంచెత్తారు. మొదటి భాగంలో డీ గ్లామరైజ్డ్‌గా చూపించడంతో, రెండో భాగంలో తనను చూసి అభిమానులు చాలా ఆనందపడతారన్నారు. ఇక చివరి రోజు షూటింగ్ అప్పుడు తాను పెద్దగా భావోద్వేగానికి గురి కాలేదని, కానీ ఆ విషయాన్ని రానా వేదిక మీద తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు మాత్రం అది ఒక్కసారిగా ఉబికి వచ్చిందని, డ్యాం ఫ్లడ్ గేట్లు ఎత్తేసినట్లుగా అయ్యిందని చెప్పారు. తాను రానాను ఎంతగానో మిస్సవుతానని, తన భల్లాలదేవుడిగా చేసినందుకు లక్షల థాంక్స్ అని రాజమౌళి చెప్పారు. ఇక ప్రభాస్ గురించి చెప్పడానికి మాటలు రావట్లేదని, అతడే ఎందుకు బాహుబలి అయ్యాడో, బాహుబలిలో అతడేంటో తన ఇంటర్వ్యూలలో వివరిస్తానన్నారు. బాహుబలి2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చినందుకు కరణ్ జోహార్, అనిల్ తడానీలకు కృతజ్ఞతలు చెప్పారు. వాళ్లతో అనుబంధం చాలా గొప్పగా ఉందన్నారు. ఇక అన్నింటికంటే చివరగా చెప్పినా.. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవుడిని అయితే రాజమౌళి ఆకాశానికి ఎత్తేశారు. చిన్నప్పుడు అతడిని తన చేతులతో ఎత్తుకున్నానని, ఇప్పుడు దండాలయ్యా పాటను పెద్దన్న (కీరవాణి) కంటే కూడా బాగా పాడాడని అంటూ ఆ పాట యూట్యూబ్ లింకును ట్వీట్ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement