వెయ్యికోట్లకు పైగా కలెక్షన్లు సాధించే దిశగా దూసుకెళ్లిపోతున్న బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. రెండు భాగాల్లోను కూడా హీరో, విలన్లతో సమాన స్థాయిలో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో రమ్యకృష్ణ జీవించారు. ఆమె తమ సినిమాకు ఓ ఎసెట్ అని స్వయంగా రాజమౌళి కూడా చెప్పారు. అయితే.. అసలు మొదట్లో ఈ పాత్రకు ఇటు సౌత్, అటు నార్త్ ఇండియాలు రెండింటిలోనూ మంచి పేరున్న అలనాటి టాప్ హీరోయిన్ శ్రీదేవిని తీసుకుందామని అనుకున్నారట. రీఎంట్రీకి ఇది చాలా మంచి అవకాశం అవుతుందని అందరూ ఎంతలా చెప్పినా ఆమె మాత్రం ఈ పాత్ర చేయడానికి ససేమిరా అన్నారని తెలిసింది. సినిమా పెద్దదని తెలుసు, భారీ విజయం సాధించే అవకాశం ఉంటుందని కూడా తెలుసు. అయినా ఇంత పెద్ద సినిమాలో అంత ముఖ్యమైన పాత్ర పోషించడానికి శ్రీదేవి ఎందుకు నిరాకరించారంటే.. అందుకు ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి.
మొదటిది.. ప్రభాస్ అంత పెద్ద కొడుక్కి తాను తల్లిగా చేయడం ఏంటని ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం. రెండోది.. కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ అడగడం. ఈ రెండింటిలో అసలైన కారణం ఏదైనా శ్రీదేవి మాత్రం గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యిందంటూ బాలీవుడ్ నటీనటులు, దర్శకులు ఇప్పుడు చెబుతున్నారు. హిందీ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి లాంటి సినిమాలో ఎంత చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా కళ్లు మూసుకుని సరేనంటారు. రెండో భాగంలో తనకు మంచి అవకాశం ఇచ్చినందుకు సుబ్బరాజు కూడా ఆడియో రిలీజ్ సమయంలో దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. హాస్యనటుడు పృథ్వి చాలా కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఇలా ఎంతోమంది అంత పెద్ద సినిమా కాబట్టి తాము ఏదో ఒక పాత్ర చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ శివగామి లాంటి అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం వచ్చినా.. శ్రీదేవి దాన్ని వదులుకోవడం చాలా పెద్ద పొరపాటని అంటున్నారు.