రాజమౌళి చిత్రంలో అతిలోకసుందరి?
తమిళసినిమా: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అది సినీ రంగానికి వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బాహుబలి, బాహుబలి–2 చిత్రాలు సాధించిన విజయాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా అందులో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు ఆమె అందుకున్న ప్రశంసల గురించి తెలిసిందే.
అయితే ఆ పాత్రకు ముందుగా నటి శ్రీదేవిని నటింపజేయాలని ప్రయత్నించినట్లు, అందుకు ఆమె విధించిన షరతులకు తట్టుకోలేక రమ్యకృష్ణను ఎంచుకున్నట్లు దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకే దారి తీశాయి. ఇంత జరిగిన తరువాత తాజా గా రాజమౌళి దర్శకత్వంలో అతిలోకసుందరి శ్రీదేవి నాయకిగా నటించనున్నారనే ప్రచా రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి రాజమౌళి తదుపరి చిత్రం ఏమిటన్నది అధికారికంగా ప్రకటించలేదు. అయితే మహాభారతం నేపథ్యంలో ఒక చిత్రం చేయాలన్న ఆసక్తి వ్యక్తం చేశారు. బాహుబలి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కేరళా వెళ్లినప్పుడు నటుడు మోహన్‌లాల్‌తో చిత్రం చేయాలన్న కోరికను వెల్లడించారు.