శ్రీదేవిని రాజమౌళి ఎందుకు... | sridevi special interview for mom movie pramotions | Sakshi
Sakshi News home page

శ్రీదేవిని రాజమౌళి ఎందుకు...

Published Sat, Jun 24 2017 11:33 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

శ్రీదేవిని రాజమౌళి ఎందుకు... - Sakshi

శ్రీదేవిని రాజమౌళి ఎందుకు...

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న అందర్నీ వేధించింది.
ఇప్పుడు శ్రీదేవిని రాజమౌళి ఎందుకలా అన్నాడు? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది.
రాజమౌళి అన్న మాటలు శ్రీదేవిని కూడా చాలా బాధించాయి.. చాలా వేధించాయి.
50 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఎవర్నీ ఒక మాట అనలేదు. ఎవరితో ఒక మాట పడలేదు.
భూదేవంత సహనం ఉన్న శ్రీదేవి మనసు గాయపడింది.
అసలు ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. ఏది నిజమో.. ఏది అబద్ధమో..
మనసు విప్పి చెప్పాలనుకుంది... సాక్షి పాఠకులతో మాత్రమే పంచుకుంది.



నాలుగేళ్ల క్రితం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ సినిమా ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌  వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. వయసు పెరుగుతున్నట్టే అనిపించడం లేదు!
(నవ్వుతూ...) ఏం చెప్పమంటారు? ఎవరైనా నా గురించి ఇలా చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. హెల్దీ లైఫ్, హెల్దీ థింకింగ్, బీయింగ్‌ హ్యాపీ... ఈ మూడూ చాలు! మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే అది ముఖంలో కనిపిస్తుంటుంది.

‘మామ్‌’ మూవీ చేయడానికి మెయిన్‌ రీజన్‌ ఏంటి?
కథ... అంతేనండీ! వేరే కారణాలేవీ లేవు. మా ఆయన (శ్రీదేవి భర్త, చిత్రనిర్మాత బోనీ కపూర్‌) నాతో ‘నీకో లైన్‌ చెబుతాను. నచ్చితే సినిమా చేద్దాం. స్క్రిప్ట్‌ డెవలప్‌ చేద్దాం’ అన్నారు. లైన్‌ వినగానే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేనీ సినిమాలో నటించకపోయినా.. మీరు మాత్రం తప్పకుండా నిర్మించాలని మా ఆయనతో అన్నాను. అంతగా ఈ సబ్జెక్ట్‌ నాకు కనెక్ట్‌ అయ్యింది.

తల్లీకూతుళ్ల రిలేషన్‌ మీద సినిమా కాబట్టి, ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు గుర్తొచ్చారా?
లేదండీ! ‘మామ్‌’ చేసినప్పుడు మా అమ్మగారు గానీ, నా పిల్లలు గానీ గుర్తు రాలేదు. దేవకి (సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు) మనసులో ఎంత బాధ ఉంది? పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అనేవి  నా మనసులో ఉన్నాయి. దేవకి పాత్రలో ఉన్నంతసేపూ నా ఫ్యామిలీ మెంబర్స్‌ గుర్తు రాలేదు.

మీ చిన్నప్పటి నుంచి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే వరకూ.. మీ అమ్మగారు మిమ్మల్ని గైడ్‌ చేశారు.. ఆమె గురించి కొన్ని మాటలు...
తప్పకుండా! ఈ రోజు నేను ఏమాత్రం కొంచెం ఎఛీవ్‌ చేశానన్నా... ఆ క్రెడిట్‌ మా అమ్మకే ఇవ్వాలి. అమ్మ నన్ను కూర్చోబెట్టి ఏం నేర్పలేదు. కానీ, ఆమె నుంచి జీవితం అంటే ఏంటనేది నేర్చుకున్నాను. లైఫ్‌లో ఏం చేసినా వంద శాతం కష్టపడాలి. ఊరికే చేయాలని చేయకూడదు. హార్డ్‌ వర్కింగ్‌. బీయింగ్‌ పంక్చువల్‌ – ఈ లక్షణాలన్నీ అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నా. ‘కష్టే ఫలి. నో పెయిన్‌–నో గెయిన్‌’ – ఇలాంటివి నాకు నేర్పించింది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక యాభై శాతం నేను నా పిల్లలకు ఇవ్వగలిగితే చాలు. అదే పెద్ద ఎచీవ్‌మెంట్‌ అనుకుంటా.

నేను కొంచెమే ఎచీవ్‌ చేశాననడం మీ గొప్పతనం. 50 ఏళ్ల కెరీర్‌... 300 సినిమాలంటే జోక్‌ కాదు. మీరు చాలా ఎచీవ్‌ చేశారు. ఎప్పుడూ అలసిపోలేదా?
ఇప్పుడీ ‘మామ్‌’ నా ఫస్ట్‌ ఫిల్మ్‌లా ఉంది (నవ్వులు). ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో అడుగు పెట్టినట్టు ఫీలవుతున్నా! మీరు చెబుతుంటే ‘300 సినిమాలు చేశానా?’ అనిపిస్తోంది. అదర్‌ వైజ్‌... ఐ ఫీల్‌ లైక్‌ థిస్‌ ఈజ్‌ మై ఫస్ట్‌ ఫిల్మ్‌.

ఈ సినిమా చేసేటప్పుడు మా అమ్మ గుర్తు రాలేదన్నారు. మీ వ్యక్తిగత జీవితంతో సినిమా కథలను రిలేట్‌ చేసుకోరా?
లేదండీ! ఎందుకంటే... ‘మామ్‌’ కథలో ఆ అమ్మకు జరిగేది లోకంలో ఎవరికీ జరగ కూడదు. ‘ఇట్స్‌ వరస్ట్‌ థింగ్‌ టు హ్యాపెన్‌ ఫర్‌ ద ఫ్యామిలీ’. అది ఎవరి లైఫ్‌లోనూ జరిగి ఉండదు. కానీ, ఆ కుటుంబానికి జరిగింది. అప్పుడు ఆ అమ్మ ఎలా ఫీలవుతుందనేదే తప్ప... మా ఫ్యామిలీ గురించి ఆలోచనలు రాలేదు. సినిమా వేరు.. జీవితం వేరు.

మీరెలాంటి మదర్‌? స్ట్రిక్టా, ఫ్రెండ్లీయా?
(నవ్వుతూ). ఫుల్‌ ఫ్రెండ్లీ. యాక్చువల్‌గా ఎప్పుడూ స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి నా పిల్లలు తీసుకు రాలేదు. చాలా తక్కువ సార్లు స్ట్రిక్ట్‌గా ఉంటాను.

‘మామ్‌’ ట్రైలర్‌లో ‘వచ్చాను రా దానమ్మను’ అనే డైలాగ్‌ చెప్పే టైమ్‌లో మీ కళ్లలో ఆగ్రహం కనిపించింది. మీ పిల్లల గురించి రాకూడని వార్తలు వచ్చినప్పుడు ఓ మదర్‌గా మీరెలా ఫీలవుతారు?
అమ్మ ఎక్కడైనా అమ్మే కదా. ఐయామ్‌ వెరీ ప్రొటెక్టివ్‌ అబౌట్‌ మై చిల్డ్రన్‌. మా అమ్మాయి ఓ పార్టీకి వెళ్లొచ్చి, నాకు ఫొటోలు చూపించింది. ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రదర్శకురాలు గౌరీ షిండేతో ఆ ఫొటోలు దిగింది. గౌరీ కూడా నాకు ఫోన్‌ చేసి ‘పాపతో పార్టీలో మాట్లాడాను. తనతో చాలా టైమ్‌ స్పెండ్‌ చేశా’ అని చెప్పింది. తర్వాత రోజు పేపర్‌లో మా పాప ఎవరో హీరో వెనకాల, అతను ఎక్కడికి వెళితే అక్కడే తిరుగుతుందని రాశారు. పాప చాలా అప్‌సెట్‌ అయ్యింది. కానీ, నా పాప గురించి నాకు తెలుసు. నేను అలాంటి వార్తలు చూసి నవ్వుకుంటాను. కానీ, కొన్ని వార్తలు మాత్రం నిజంగా బాధకు గురిచేస్తాయి. అలాంటి వార్తలు రాసేవాళ్లు ‘వాళ్ల ఫ్యామిలీ ఎఫెక్ట్‌ అవుతుంది. తల్లి మనసు ఎంత బాధపడుతుంది’ అనేది అర్థం చేసుకోవాలి.

నా కూతురి పెళ్లి చేస్తున్నానా? షూటింగ్‌కి వస్తున్నానా?
50 ఏళ్ల కెరీర్‌లో మీ మీద ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినట్లు అనిపించలేదు?
అవును. ఎప్పుడూ ఎవరి గురించీ నేను చెడుగా మాట్లాడింది లేదు. దర్శక–నిర్మాతలెవరూ నా గురించి చెడుగా మాట్లాడింది లేదు. నిజం చెప్పాలంటే చాలా సినిమాలకు నేను డబ్బులే తీసుకోలేదు. చివరి నిమిషంలో కష్టాల్లో ఉన్నామని, బడ్జెట్‌ ఎక్కువ అయ్యిందని నిర్మాతలు అంటే అర్థం చేసుకుని బోలెడు సినిమాలకు నా రెమ్యునరేషన్‌ తీసుకోలేదు. నేనే కాదు మా అమ్మ కూడా పారితోషికం విషయంలో పట్టూవిడుపుగా ఉండేవారు. ఆవిడ దగ్గరే నేనిలా ఉండటం నేర్చుకున్నాను. అలాంటిది నేను మొత్తం హోటల్‌ ఎందుకు బుక్‌ చేయమని అడుగుతా? నేనేమైనా నా కూతురి పెళ్లి చేస్తున్నానా? లేక షూటింగ్‌కి వస్తున్నానా? అయినా ఒక షో ఇంట్రస్ట్‌గా నడవడం కోసం లేని పోనివి చెప్పకూడదు. ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూడా... రాజమౌళిగారు నాతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్లు పక్కన కూర్చుని చూసినట్లు మాట్లాడటం బాధగా అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం చాలా తప్పు. పైగా, రాజమౌళిగారు నన్ను కలిసిన ప్రతిసారీ ఒక్కో డిమాండ్‌ చేశానట. అది చాలా తప్పు. ‘బాహుబలి’ గురించి ఆయన నాతో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు కేవలం ‘క్రియేటివ్‌ డిస్కషన్‌’ మాత్రమే జరిగింది. ‘కమర్షియల్స్‌’ గురించి మాట్లాడలేదు. అయినా ఒక్కో మీటింగ్‌లో ఒక్కో డిమాండ్‌ ఎలా పెడతామండి!

‘మామ్‌’ ట్రైలర్‌ చూసి, మీ పిల్లలేమన్నారు?
వాళ్లు సినిమా కూడా చూశారు. జాన్వీ అయితే నన్ను గట్టిగా కౌగలించుకుంది. తను అలా చేయడం అదే మొదటిసారి. మా పిల్లలకు సినిమా బాగా నచ్చింది.

జాన్వీ ఎవరితోనో లవ్‌లో ఉందని, మీరు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని ఇంకో న్యూస్‌ వచ్చింది...
ఇక వాటన్నిటి గురించి మాట్లాడడం వేస్ట్‌. ముంబయ్‌లో ఇటీవల ఓ పత్రికలో ‘మా పాపకు పెళ్లి చేయాలి’ అని నేను చెప్పినట్టు రాశారు. ప్రతి అమ్మ తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది కదా! నేనూ అదే చెప్పా. కానీ, అంతకు ముందు ‘జాన్వీ ఇండిపెండెంట్‌గా ఎదగాలి. తన కాళ్లపై తను నిలబడాలి. ఊరికే పెళ్లి చేసి కుక్కేయడం కాదు. తనకూ ఓ కెరీర్‌ ఉండాలి’ అని చెప్పా. అదంతా వదిలేసి ‘శ్రీదేవి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది’ అని రాశారు. దాన్నే హెడ్‌లైన్‌ చేశారు.

ఇంట్లో ఆల్రెడీ ఓ సక్సెస్‌ఫుల్‌ స్టార్‌ ఉన్నారు కాబట్టి, జాన్వీని మీతో కంపేర్‌ చేస్తారు. మీరేమంటారు?
జాన్వీ ఎంత పెద్ద స్టార్‌ అవుతుందనేది మన చేతుల్లో లేదు. తన టాలెంట్, హార్డ్‌వర్క్‌ బట్టి పైకొస్తుంది. తనింకా ఒక్క అడుగు కూడా వేయలేదు. నాతో తనను కంపేర్‌ చేయడమనేది చాలా రాంగ్‌. ఎందుకంటే... నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. హీరోయిన్‌గా పరిచయమయ్యే టైమ్‌కి చైల్డ్‌ స్టార్‌గా సుమారు 50 సినిమాలు చేశా. హీరోయిన్‌గా ఫస్ట్‌ సినిమా చేసే టైమ్‌కి షూటింగ్‌ ఎలా ఉంటుంది? కెమెరా... వంటివన్నీ తెలుసు. మా పాపకు మాత్రం ‘ఇట్స్‌ జస్ట్‌ ఎ ఫస్ట్‌ ఫిల్మ్‌’ అన్నమాట. సో, తననూ, నన్నూ కంపేర్‌ చేయడమనేది న్యాయం కాదు. తనని ఇండివిడ్యువల్‌గా చూస్తే బాగుంటుంది.

మీ పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు. చిన్నమ్మాయి మీకంటే హైట్‌ అనుకుంటా!
అవునండీ. జాన్వీ కంటే... నాకంటే చిన్న పాప ఖుషీ ఇంకా హైట్‌!

ఈ వయసులోనూ మీరింత స్లిమ్‌గా ఉన్నారు. మీ పిల్లలకు మీరేమైనా టిప్స్‌ ఇస్తారా?
నేనా? అయ్యో... లేదండీ! వాళ్లే నాకు టిప్స్‌ ఇస్తున్నారు. నేనెప్పుడైనా కొంచెం ఎక్కువ తింటే... ‘మమ్మా! ప్లీజ్‌ ఆపు’ అంటారు. ఇప్పుడు నాకంటే వాళ్లే ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నారు.

ఇంట్లో మీరు ఎక్కువ తెలుగు మాట్లాడతారా?
మా సిస్టర్, కజిన్స్‌తో తెలుగులోనే మాట్లాడతా. రోజుకి ఓ పదిసార్లైనా వాళ్లు–నేను ఫోనులో మాట్లాడుకుంటాం. నేను ఫోనులో తెలుగు మాట్లాడుతున్నంత సేపూ మా ఆయన బాగా ఎంజాయ్‌ చేస్తారు. మా సిస్టర్‌ ఫోన్‌ చేయగానే వచ్చి పక్కన కూర్చుంటారు.

మీ పిల్లలు తెలుగు మాట్లాడతారా?
లేదండీ. వాళ్లకు అంతగా రాదు. హిందీ, ఇంగ్లీష్‌ మాట్లాడతారు.

మీరు బోనీ కపూర్‌గారికి నేర్పించిన రెండు మూడు తెలుగు పదాలు చెప్పండి?
ఎప్పుడూ ‘ఏమ్మా...’ అంటుంటారు (నవ్వులు).

తెలుగు నుంచి మీ పెద్దమ్మాయికి చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి కదా?
ఏయే ఆఫర్స్‌ వచ్చాయి. ఎవరెవరు మా అమ్మాయిని నటించమని అడిగారు? అనేవి చెప్పడం నాకిష్టం లేదు. ఏదైనా దర్శక–నిర్మాతలు అఫిషియల్‌గా ఎనౌన్స్‌ చేస్తారు.

మీరు ఓ స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌ చేస్తే చూడాలనుంది?
నేను తెలుగమ్మాయినే. తెలుగు ఇండస్ట్రీ నాకెంతో ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇచ్చింది. నేను ఏనాడూ దాన్ని మర్చిపోను. తెలుగులో చేయాలని నాకూ ఉంది.

‘మామ్‌’ ప్రెస్‌మీట్‌లో రాఘవేంద్రరావుగారిని కలిసినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయా?
ఆయన చెప్పారు కదా! మా ఇద్దరి కాంబినేషన్‌లో 24 సినిమాలు వచ్చాయి. ఇట్స్‌ రియల్లీ గ్రేట్‌. ఆయన దర్శకత్వంలో చేసిన ప్రతి సినిమా నాకో అందమైన జ్ఞాపకమే. ఆయనింకా అలానే ఉన్నారు. (నవ్వుతూ..) కానీ, ఓ కళ్లజోడు లేదంతే.

నేను ఫలానా క్యారెక్టర్‌ చేయలేదని ఎప్పుడైనా ఫీలయ్యారా?
అలా ఏం లేదు. ఇప్పటివరకూ నేను ఆల్మోస్ట్‌ అన్నీ మంచి పాత్రలే చేశాను. అయితే, ముందుగా నాకు అవకాశం వచ్చినా కొన్ని సినిమాలు చేయలేక పోయాను. అవి చాలా పెద్ద హిట్టయ్యాయి. కొన్ని కారణాల వల్ల అవి చేయలేదు. దర్శక–నిర్మాతలు కూడా ‘నేనెందుకు చేయలేదు’ అనే విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. నన్నూ ఎవరూ ‘ఎందుకు చేయలేద’ని తరచి తరచి అడగలేదు.

రీసెంట్‌గా ‘బాహుబలి’ని కూడా మీరు వదిలేసుకున్నారు?
నేను చెన్నై వెళ్లినా, ముంబయ్‌ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా... ‘బాహుబలి’ గురించే  అడుగుతున్నారు. ఎందుకనేది నేనెవరికీ చెప్పలేదు. కానీ ‘సాక్షి’ పత్రిక ద్వారా ఓ క్లారిటీ ఇవ్వాలనుంది. ‘బాహుబలి’ గురించి మాట్లాడటానికి రాజమౌళిగారు నా దగ్గరకు వచ్చారు. ఆయన తీసిన ‘ఈగ’ చూశాను. నాకు బాగా నచ్చింది. అఫ్‌కోర్స్‌.. ఐ లవ్‌ ద స్టోరీ (బాహుబలి). కానీ, కొన్ని కారణాల వల్ల నేనా సినిమా చేయలేకపోయాను. అయితే, నేనేదో అన్‌రీజనబుల్‌గా డబ్బులు అడిగాననీ, తర్వాత హోటల్‌ మొత్తం బుక్‌ చేయాలన్నాననీ, పది టికెట్స్‌ (ఫ్లైట్‌) కావాలన్నాననీ... దారుణంగా, అన్యాయంగా నిర్మాతను దోచేసుకోవాలను కున్నాననే మాటలు వినిపించాయి.

అందువల్ల, సినిమా చేయలేదన్నారు. వీటిని మొదట్లో నేను నమ్మలేదు. ఇలా ఎవరు మాట్లాడతారులే అనుకున్నా. కానీ, ఒకరు యూట్యూబ్‌ లింక్‌ పంపిస్తే రాజమౌళిగారి ఇంటర్వ్యూ చూశా. అందులో ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ అనిపించాయి. నేనేదో 8 కోట్లు అడిగానట. మొత్తం హోటల్‌ బుక్‌ చేయమన్నానట. నేనంత దారుణంగా అడిగి ఉంటే... 300 సినిమాలు చేసేదాన్ని కాదు. 50 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. ఓ ఆర్టిస్ట్‌గా నిర్మాత కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను.

మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే.. మీ అమ్మాయి జాన్వీ రిజెక్ట్‌ చేసిందనే టాక్‌ వచ్చింది... నిజమా?
ఎంత అన్యాయమండీ. నాకు మహేశ్‌బాబుగారంటే చాలా ఇష్టం. ఆయన ఉన్నారంటే ఆ సినిమా నేను చూడాల్సిందే. మహేశ్‌గారి యాక్టింగ్, ఆయన స్టైల్‌ని నేను ఎంజాయ్‌ చేస్తాను. ఒకవేళ మా పాప జాన్వీకి మహేశ్‌బాబు సరసన యాక్ట్‌ చేసే చాన్స్‌ వస్తే మేం చాలా సంతోషపడతాం. అలాంటిది ఆయన సినిమాకి అడిగితే జాన్వీ రిజెక్ట్‌ చేసిందని రాశారు. జాన్వీ వయసెంత? తనింకా సినిమాలు కూడా మొదలు పెట్టలేదు. అప్పుడే ఒక హీరోని రిజెక్ట్‌ చేస్తుందా? నిజం ఏంటో తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే ‘అ ఆమ్మాయికి పొగరు’ అనరా? అలాంటివి చదివితే ఒక తల్లిగా నాకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి.

మీ ఇంట్లోనూ నిర్మాత ఉన్నారు కాబట్టి, వాళ్ల  కష్టాలు బాగా తెలిసే అవకాశం ఉంటుంది...
అవును. మా ఆయన ఎంతో అనుభవం ఉన్న నిర్మాత. ఎన్నో భారీ బడ్జెట్‌ సినిమాలు తీశారు. ఆయన పడే కష్టాలు నాకు తెలుసు.  అందుకే ఆయన నిర్మాతలను దోచుకునే డిమాండ్స్‌ చేయరు. టెక్నీషియన్‌గా రాజమౌళి పెద్ద వ్యక్తి. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాలు ఇంకా తీయాలి. ఇంకా హిట్‌ సినిమాలు తీయాలని ఆశిస్తున్నా. బట్, నా గురించి చేసిన కామెంట్స్‌కి నేను అప్‌సెట్‌ అయ్యా. ఓ పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌లో లేనిది ఉన్నట్లు ఎలా మాట్లాడవచ్చనేది నా పాయింట్‌.

కృష్ణగారితో 40 సినిమాలకు పైగా చేసినట్లున్నారు... రాఘవేంద్రరావుగారితో 24 సినిమాలు.. ఇలా రిపీట్‌ కాంబినేషన్స్‌లో సినిమాలు చేశారు కదా?
నిజమే. ఒకవేళ నేను బోలెడన్ని డిమాండ్స్‌ వాళ్ల ముందు పెట్టి ఉంటే, ఎందుకు రిపీట్‌ చేస్తారు. నేను రాజమండ్రి, విశాఖల్లో ఎక్కువ  పని చేశా. అప్పట్లో అక్కడ ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌ ఉండేవి కాదు. ఇతర సౌకర్యాలు లేవు. చెట్టు వెనకాలో, గుడిసెలోనో, ఓ ఇంటి లోపలికో వెళ్లి కాస్ట్యూమ్స్‌ చేంజ్‌ చేసుకునేదాన్ని. నేనంతటి నిరాడంబరమైన ఆర్టిస్టుని. ఒకవేళ నిర్మాతలు (బాహుబలి) ఆయనతో (రాజమౌళి) లేనిపోనివి చెప్పినా కూడా వాటిని పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌లో చెప్పటం ఎంతవరకు సమంజసం? నేను చాలా హర్ట్‌ అయ్యాను. షాక్‌ అయ్యాను కూడా. రాజమౌళి గారు చాలా మంచి మనిషి. కామ్‌ అండ్‌ డీసెంట్‌. ఏదీ ఎక్కువ మాట్లాడరనుకున్నా. ఆ ఇంటర్వ్యూ చూస్తే చాలా బాధ కలిగింది. ఒక ఆర్టిస్ట్‌ గురించి ఏమీ తెలుసుకోకుండా... అలా మాట్లాడడం కరెక్ట్‌ కాదు.

ఫైనల్లీ... మీరు బాగా హర్ట్‌ అయ్యారని అర్థమవుతోంది...
అవునండీ. చాలా. ‘ఈ వార్తలకు ఎందుకు రియాక్ట్‌ కావడం లేదు. ఎక్కడో ముంబయ్‌లో కూర్చున్నారు. ఇక్కడ విషయాలేం మీకు తెలియడం లేదు’ అంటూ కొంతమంది ఫోన్‌ చేశారు. ఎందుకులే? అని నేనెప్పుడూ పబ్లిక్‌గా ఏమీ మాట్లాడలేదు. కానీ, లోలోపల మాత్రం చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా నేను ఇన్ని మాట్లాడింది బాధతోనే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. – డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement