
కొరాపుట్ జిల్లాలో తెలుగు సినిమాల షూటింగ్స్
సందడి చేస్తున్న అగ్ర హీరోలు
పెరిగిన పర్యాటకుల తాకిడి
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నేడు సినిమా షూటింగ్స్‌తో సందడిగా మారింది. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవి. అయితే ప్రస్తుతం అంతా మారిపోయింది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం సినీ తారల ఆటపాటలతో కళకళలాడుతోంది. దీంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీపై రావాలంటే భయపడిన అధికారులే నేడు బదిలీకి ముచ్చటపడుతున్నారు. లక్షలాది మంది దేశ, విదేశీయులు విహార యాత్రలకు కోసం తరలివస్తున్నారు.
రాజమౌళి షూటింగ్ షురూ
పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కొద్దిరోజుల క్రితం సామాన్య వ్యక్తి మాదిరిగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వస్తూ ఈ ప్రాంత అందాలను తిలకించారు. దీనిలో భాగంగా కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో స్టే చేశారు. ఇక్కడి అందాలను గమనించి తాను ప్రస్తుతం సూపర్‌స్టార్ మహే‹Ùబాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ప్రస్తుతం సిమిలిగుడ ప్రాంతంలోని హోటళ్లలో గదులు దొరకడం లేదు. ఆంధ్ర సరిహద్దు సాలూరుకి కూతవేటు దూరంలో దేవమాలి పర్వతంపై ఈ సినిమా తీస్తున్నారు. అందువలన ప్రతిరోజూ ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తారలను చూసేందుకు తరలి వస్తున్నారు.

తప్పని లీకుల గోల
రాజమౌళి బృందం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ లీకుల బెడద తప్పడం లేదు. మహేష్‌బాబుని విలన్ అనుచరులు నెట్టుకుంటూ వస్తుండగా, విలన్ వీల్ చైర్ మీద ఉండడం, మహేష్ బాబు అక్కడకి చేరడం వంటి వీడియోలు లీకయ్యాయి. ఇవి కొరాపుట్ జిల్లాలో, సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి సందర్శకుడి మాదిరిగా వచ్చి కారులో కూర్చుని ఈ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది.
భారీ భద్రత
రోజురోజుకీ సందర్శకుల తాకిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇక్కడ ప్లాటూన్ పోలీసులను మోహరించింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సుమారు 80 మంది భద్రతా ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఇప్పటికే మహేష్‌బాబు, మళయాల విలన్ పృథ్వీవరాజ్ కరుణాకరణ్‌లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకా హిందీ నటులు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాంలు రావాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కూడా సినిమా నిర్మాణానికి పూర్తి సహకారం అందజేస్తోంది. తద్వారా ఈ ప్రాంతం పర్యటక రంగంలో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తోంది.

ప్రముఖుల హర్షం
ప్రస్తుతం రాజమౌళి సినిమా బృందం సందడి చేస్తుండడంపై రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రాం చంద్ర ఖడం మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ ప్రాంతంలో షూటింగ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మరిన్ని తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కోరారు. బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక మాట్లాడుతూ.. రాజమౌళి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి సినిమాలు ఈ ప్రాంతంలో తీయడం వలన స్థానికులకు ఉపాధితో పాటు ఆదాయం వనరులు పెరుగుతాయన్నారు.
ఇప్పటివరకు చిత్రీకరణలు
ఈ ప్రాంతంలో ఇదివరకే ప్రముఖ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. పుష్ప–2 సినిమాను పక్కనే ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో అత్యధిక భాగం షూటింగ్ చేవారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కొరాపుట్ జిల్లాలోనే చిత్రీకరణ చేశారు. అప్పట్లో వేంకటేష్ తదితర నటులు ఈ ప్రాంతంలో పర్యటించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా కొరాపుట్ జిల్లాలోనే అత్యధిక భాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రజల ముందుకు రానుంది. ఈ సినిమా జయపూర్ మెయిన్ రోడ్డు మీద షూటింగ్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment