Kalki Movie Review, in Telugu | ‘కల్కి’ మూవీ రివ్యూ | Dr Rajasekhar, Prasanth Varma - Sakshi
Sakshi News home page

‘కల్కి’ మూవీ రివ్యూ

Published Fri, Jun 28 2019 12:40 PM | Last Updated on Sat, Jun 29 2019 9:36 AM

Rajasekhars Kalki Telugu Movie Review - Sakshi

టైటిల్ : కల్కి
జానర్ : ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌
తారాగణం : రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్‌ రామకృష్ణ, అశుతోష్ రాణా
సంగీతం : శ్రావణ్‌ భరద్వాజ్‌
దర్శకత్వం : ప్రశాంత్‌ వర్మ
నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక

గరుడవేగ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్‌, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన పీరియాడిక్‌ థ్రిల్లర్‌ మూవీ కల్కి. రాజశేఖర్‌ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్‌ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మరి ప్రశాంత్‌ వర్మ నమ్మకాన్ని కల్కి నిలబెట్టిందా..? ఈ థ్రిల్లర్‌తో రాజశేఖర్‌ మరో సక్సెస్‌ అందుకున్నాడా..?

కథ :
కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్‌ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు.

అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్‌ బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను దారుణంగా హత్య చేస్తారు. హత్యకు కారణం నర్సప్ప అని కొందరు, కాదు పెరుమాండ్లు చంపాడని మరి కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్‌)ని ప్రత్యేకంగా అపాయింట్‌ చేస్తారు. కొల్లాపూర్‌ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో  ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్‌ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
గరుడ వేగ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్‌, కల్కి పాత్రలో జీవించాడు. అక్కడక్కడా లుక్‌ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్‌ అనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. అదా శర్మ పోషించిన హీరోయిన్‌ పాత్రకు కథలో ఏ మాత్రం ప్రాదాన్యం లేదు. కేవలం ఓ పాట కోసమే ఆమెను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి నటిగా పేరున్న నందితా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్‌ మోడ్‌లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్‌ టైమింగ్‌తో మెప్పించాడు. విలన్‌గా అశుతోష్‌ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్‌, సిద్దు జొన్నలగడ్డ, చరణ్‌దీప్‌, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
ఇది పూర్తిగా ప్రశాంత్ వర్మ మార్క్‌ సినిమా. రెండో ప్రయత్నంగా పీరియాడికల్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు. అయితే చెప్పాల్సిన కథ రెండున్నర గంటలకు సరిపడా లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ కమర్షియల్‌ ఫార్మాట్‌ కోసం కావాలనే ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్‌ను కట్టిపడేశాడు.

సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్‌ నేపథ‍్యం సంగీతంతో వావ్‌ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సీన్‌ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. 80ల నాటి లుక్‌ తీసుకురావటంలో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా నాసిరకంగా ఉన్నాయి. సీ కల్యాణ్‌తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్‌ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :
నేపథ్య సంగీతం
క్లైమాక్స్‌
ప్రశాంత్‌ వర్మ మార్క్‌ టేకింగ్‌

మైనస్‌ పాయింట్స్‌ :
హీరోయిన్‌ పాత్ర
స్క్రీన్‌ప్లే
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
సాంగ్స్‌

- సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement