
వేసవి బరిలో ఆ ముగ్గురు
హైదరాబాద్: వచ్చే ఏడాది వేసవి బరిలో ముగ్గురు స్టార్ హీరోలు తలపడనున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య ఈ బాక్సాఫీసు పోరు ఆసక్తికరంగా జరగబోతోంది. వీరి సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధం అవుతుండటంతో ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఉండే ఈ రసవత్తరమైన పోటీపై అభిమానులు దృష్టి సారించారు..
మొదటిది రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న తెలుగు, తమిళం ద్విబాషా చిత్రం కబాలి. రెండోది శ్రీమంతుడు లాంటి భారీ హిట్ తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. ఇక మూడోది బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'సరైనోడు'. ఈ మూడు ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కాగా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న రజనీ కబాలి సినిమాను.. షూటింగ్ జాప్యం కారణంగా వాయిదా వేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీని తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అటు మహేష్ బాబు బ్రహ్మోత్సవాన్ని కూడా ఏప్రిల్ 8న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వేసవి బరిలో నిలవాలని యోచిస్తున్నారట. మరోవైపు ఏప్రిల్‌ను ఎప్పుడూ లక్కీ నెలగా భావిస్తున్న అల్లు అర్జున్ ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తాడని సమాచారం. గతంలో ఆయన సినిమాలు రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి ఇదే సమయంలో విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే సరైనోడు సినిమాను ఏప్రిల్ నెలకల్లా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సో... అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది వేసవి బరిలో ప్రిన్స్ , తలైవా, బన్నీ పోటీ ఖాయమయిందన్నమాట.