
అతిథిగా రజనీ?
ఒక ఆశ్చర్యకరమయిన ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే కమల్‌హాసన్, రజనీ కలిసి త్వరలో ఒక చిత్రం చెయ్యబోతున్నారన్నది. కమల్ హాసన్, రజనీకాంత్ తొలి రోజుల్లో పలు చిత్రాలు కలిసి నటించారన్న విషయం తెలిసిందే. ఆ చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ తరువాత ఇద్దరికీ సొంత ఇమేజ్ రావడంతో విడివిడిగా నటించడం సూపర్‌స్టార్స్‌గా ఎదగడం తెలిసిందే. ఆ తరువాత కూడా ఈ దిగ్గజాల కలయికలో చిత్రం చేయూలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు.
స్వయంగా వారి గురువు కె.బాలచందర్‌కు కూడా అలాంటి ఆలోచన వచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. అయితే అలాంటి ఒక అద్భుత కలయికతో త్వరలో ఒక చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ హీరోగా నటించనున్నట్లు రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ టాక్.
ఈ చిత్రానికి వీర విళైయాట్టు అనే టైటిల్‌ను నిర్ణయిం చినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఏదీ లేదు. ప్రస్తుతం కమల్‌హాసన్ ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత మలయాళ చిత్రం దృశ్యం రీమేక్‌లో నటించనున్నారు. అలాగే రజనీకాంత్ లింగా చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.