రజనీకాంత్
అవును. పధ్నాలుగు కాదు.. కొన్నే! ఏంటీ కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? మరేం లేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 14 కట్స్ ఇచ్చిందని, ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిందనే వార్త జోరుగా ప్రచారమవుతోంది. పా. రంజిత్ దర్శకత్వంలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వండర్‌బార్ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ స్పందిస్తూ – ‘‘మా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం వాస్తవమే. కానీ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారనీ, సెన్సార్ బోర్డ్ 14 కట్స్ చెప్పారని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని కట్స్ చెప్పారు కానీ 14 మాత్రం కాదు’’ అని పేర్కొన్నారాయన. ‘కాలా’ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌కు రజనీకాంత్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఇది నిజం కాదని కార్తీక్ సుబ్బరాజ్ స్పష్టం చేశారు. ‘‘తలైవర్‌తో (రజనీకాంత్) నేను చేయబోయే సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండదు. అది పూర్తి ఫిక్షన్ స్టోరీ. ఫ్యాన్స్ రజనీసార్ నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉంటాయి’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్.
Comments
Please login to add a commentAdd a comment