
నటుడు రజనీకాంత్ రాజకీయా రంగప్రవేశం సంగతి ఏమోగానీ, ఆయన సినిమాలను మాత్రం వరుసగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందుకంటే రజనీకాంత్ తన చిత్రాల వేగాన్ని పెంచారని చెప్పవచ్చు. ఇంతకు ముందు సినిమాల మధ్య గ్యాప్ తీసుకునేవారు. ఇటీవల కబాలి, కాలా, పేట, దర్బార్ అంటూ వరుసగా చిత్రాలు చేసుకుంటూపోతున్నారు. ప్రస్తుతం దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక నెక్ట్సేంటీ? అన్న ప్రశ్నకు సమాధానం రెడీ అయిపోయ్యింది. రజనీకాంత్‌ను శివ డైరెక్ట్ చేయనున్నారు. ఈ దర్శకుడు వరుస హిట్లతో జోరు మీదున్నారు. వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాలను చేసిన శివ తాజాగా రజనీకాంత్ కోసం సూపర్ కథను సిద్ధం చేశారు. అది రజనీకాంత్‌కు నచ్చడంతో తెరకెక్కనుంది. అయితే నటుడు సూర్య హీరోగానూ శివ ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత రజనీకాంత్ నటించే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తాజా సమాచారం.
ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారన్నది తాజా సమాచారం. 100 చిత్రాలకు పైగా చేసిన డీ.ఇమాన్ ఇప్పటి వరకరూ రజనీకాంత్ చిత్రానికి పనిచేయలేదన్నది గమనార్హం. తాజా ఆ అవకాశాన్ని దర్శకుడు శివ కల్పించినట్లు తెలిసింది. అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించన విశ్వాసం చిత్రానికి డీ.ఇమాన్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యిందనే టాక్ వచ్చింది. దీంతో దర్శకుడు శివ తాను రజనీకాంత్ హీరోగా రూపొందించనున్న చిత్రానికి డీ.ఇమాన్‌నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు సమాచారం.
అయితే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా శివతో చేసే చిత్రం తరువాత రజనీకాంత్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల తరువాత ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment