నేను రాజమౌళి అభిమానిని : శంకర్‌ | Rajinikanth Shankar 2Point0 Trailer Launch Highlights | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 4 2018 9:54 AM | Last Updated on Sun, Nov 4 2018 5:03 PM

Rajinikanth Shankar 2Point0 Trailer Launch Highlights - Sakshi

లేట్‌గా వచ్చినా రైట్‌గా రావాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. ఆయన కథానాయకుడిగా ద్విపాత్రాభియనం చేసిన చిత్రం 2.ఓ. స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఒరిజినల్‌ 3డీ ఫార్మెట్‌లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం చెన్నై రాయపేటలోని సత్యం సినీ థియేటర్‌లో నిర్వహించారు.

స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్‌ పతాకంపై సుభాస్‌కరన్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతమాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు. సౌండ్‌డిజైనర్‌గా ఆస్కార్‌ అవార్డుగ్రహీత రసూల్‌పూకుట్టాన్‌ పని చేశారు. ఎమీజాక్సన్‌ కథానాయకిగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ విలక్షణ ప్రతినాయకుడిగా నటించారు. 

రిటైర్డ్‌ అవుదామనుకున్నా..
సంగీతదర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం లండన్, చెన్నై, ఢిల్లీలలో సంగీతాన్ని రూపొందించామని తెలిపారు. దర్శకుడు శంకర్‌ చిత్ర కథ చెప్పినప్పుడు ఇందులో సాంగ్స్‌ ఉండవన్నారు. ఆ తరువాత రెండు పాటలు చోటు చేసుకున్నాయన్నారు. ఇప్పుడు మొత్తం చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయని తెలిపారు.

సంగీత దర్శకుడు అనిరుద్‌ వీడియో ద్వారా మీకు స్ఫూర్తి ఎవరని ప్రశ్నించగా తాను ఆస్కార్‌ అవార్డు కూడా సాధించుకున్నాను కదా ఇక రిటైర్డ్‌ అవుదామనుకున్నానన్నారు. తన ఫేవరేట్‌ నటుడు రజనీకాంత్‌ అని 10 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. ఆయనలోని పలు విషయాలు తనకు నచ్చుతాయన్నారు. ఆయనలోని స్పిరిచ్యువాలిటీ, పంచ్‌ డైలాగ్స్‌ చెప్పడం వంటివి బాగా నచ్చుతాయన్నారు.గత 40 ఏళ్లుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నా, ఇప్పుటికీ ఆయనకు నటనపై అంకితభావం చూసి ఎడ్మైర్‌ అ యి తన విరమణ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ఇక తనకు స్ఫూర్తి అంటే తన తండ్రి, దైవం అని పేర్కొన్నారు.

2.ఓ ప్రత్కేకత ఏంటంటే..
దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 3డీ ఫార్మెట్‌లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు సౌండ్‌ పరంగా కూడా కొత్తగా చేయాలనుకున్నామన్నారు. దీంతో ఈ విషయం గురించి సౌడ్‌ డిజైనర్‌ రసూల్‌ పొకుట్టితో చర్చించిన తరువాత 4డీ సౌండింగ్‌లో చేయడానికి సిద్ధం అయ్యామన్నారు. ఇది ప్రేక్షకులు కూర్చున్న కాళ్ల వద్ద కూడా సౌండ్‌ ఎఫెక్ట్‌ వస్తుందని వివరించారు.

ఇక 2.ఓ చిత్రంలో ప్రధాన ఆకర్షణ అంటే రజనీకాంత్‌ నటించిన వశీకరన్, చిట్టి, అక్షయ్‌కుమార్‌ల పాత్రలు, గ్రాఫిక్స్‌ సన్నివేశాలు, లైకా సంస్థ అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభ దశలో రజనీకాంత్‌ ఆనారోగ్యానికి గురయ్యారని, అయినా చిత్ర షూటింగ్‌ను ఢిల్లీలో 6 నెలల పాటు ప్లాన్‌ చేయడంతో దానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అలాగే 40 డిగ్రీల మండేఎండను కూడా లెక్క చేయకుండా నటించారని చెప్పారు. అంత అంకితభావం కారణంగానే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ మూడుసార్లు నేపథ్య సంగీతాన్ని అందించారని తెలిపారు.

దర్శకుడు రాజమౌళి అభిమానిని
బాహుబలి చిత్రం ఫేమ్‌ రాజమౌళి వీడియో ద్వారా తాను రూ.100 కోట్ల బడ్జెట్‌లో చిత్రం చేయడానికే చాలా ఒత్తిడికి గురయ్యానని, మీరు సుమారు రూ.550 కోట్ల బడ్జెట్‌లో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. అందుకు బదులిచ్చిన శంకర్‌ తాను మీ అభిమానినని పేర్కొన్నారు. ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా మీరని అన్నారు. ఈ కార్యక్రమంలో మీరు ఒక భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇక మీరు అడిగిన ప్రశ్నకు తాను చిత్రంపై పుల్‌ ఎఫర్ట్‌ పెడతానన్నారు. పూర్తిగా నిర్మాణంపై అనలైజ్‌ చేసిన తరువాతనే షూటింగ్‌కు సిద్ధం అవుతానని చెప్పారు.

ఇండియన్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌
అనంతరం చిత్ర కథానాయకుడు రజనీకాంత్‌ మాట్లాడుతూ తానిప్పుడు చెబుతున్నాను 2.ఓ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది అని అన్నారు. ఇందుకు ముందుగానే దర్శకుడు శంకర్‌కు, నిర్మాత సుభాస్‌కరన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. సుభాస్‌కరన్‌ ఈ చిత్రాన్ని నమ్మి రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టడం సాధారణ విషయం కాదన్నారు. అయితే శంకర్‌ గొప్ప దర్శకుడన్నారు. ఆయన షోమ్యాన్‌. ఇండియన్‌ జేమ్స్‌ కేమరనూ, స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ అని పేర్కొన్నారు.

ఒక సక్సెస్‌ఫుల్‌ చిత్రానికి మ్యాజిక్‌ వర్కౌట్‌ కావాలన్నారు. అది 2.ఓ చిత్రానికి అయ్యిందని అన్నారు. ఇది ఇండియన్‌ చిత్రం కాదని, ఇంటర్నేషనల్‌ చిత్రం అని పేర్కొన్నారు. సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా ఇందులో ఉంటుందని చెప్పారు. దాన్ని శంకర్‌ చాలా ఇన్‌ట్రెస్టింగ్‌గా చెప్పారని అన్నారు. ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు ఇది సాధ్యమా? అని అడగలేదన్నారు.

ఎందుకంటే ఆయన ఇంతకు ముందే తనతో రెండు సూపర్‌ హిట్‌ చిత్రాలను చేసిన దర్శకుడు కావడమేనన్నారు. ఆయన కేపబుల్‌ ఏమిటో తనకు తెలుసన్నారు. అందుకే నిర్మాత ఎవరని అడగ్గా సుభాస్‌కరన్‌ అని చెప్పారన్నారు. ఈ చిత్రాన్ని ముందు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో మొదలెట్టామని అది చివరికి రెండింతలు అయ్యిందని చెప్పారు.

చిత్రం నుంచి వైదొలగాలనుకున్నా..
చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయిన 5, 6 రోజులు షూటింగ్‌ జరిగిన తరుణంలో తాను స్వల్ప అనారోగ్యానికి గురయ్యానన్నారు. అలాంటి పరిస్థితుల్లో 14 నుంచి 18 కిలోల బరువు గల దుస్తులను ధరించి నటించడం కష్టం అనిపించడంతో నటించడానికి ధైర్యాన్ని కోల్పోయానన్నారు. దీంతో దర్శకుడితో తానీ చిత్రంలో నటించలేను, ఇప్పటి వరకూ అయిన ఖర్చును, అడ్వాన్స్‌ సహా తిరిగి ఇచ్చేస్తానని చెప్పానన్నారు. అందుకు ఆయన నిరాకరిస్తూ ఏం పర్వాలేదు.. మీ ఆరోగ్యమే తమకు ముఖ్యం. తాను చెప్పినట్లు చేస్తే చాలు అని అన్నారన్నారు.

అదే విధంగా నిర్మాత సుభాస్‌కరన్‌ చిత్ర షూటింగ్‌ 4 నెలలు కాదు 4 ఏళ్లు పట్టినా పర్వాలేదు అని భరోసా ఇచ్చారన్నారు. అలా తనకు ఒక మంచి మిత్రుడు ఈ చిత్రం ద్వారా లభించారని పేర్కొన్నారు. ఈ చిత్రంతో తాము కొంచెం ఆలస్యంగా వస్తున్నామని, అయితే లేట్‌గా వచ్చినా, రైట్‌గా రావాలి. వస్తే కరెక్ట్‌గా కొట్టాలి అని నవ్వుతూ తాను చెప్పింది చిత్రం గురించి అని అన్నారు.

తమిళంలో అక్షయ్‌కుమార్‌
కాగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ ముందుగా తనను క్షమించాలి. తాను తమిళంలో మాట్లాడుతున్నాను అని వణక్కమ్‌ రజనీ కాంత్, శంకర్, ఏఆర్‌.రెహ్మాన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ 2.ఓ చిత్రం రజనీకాంత్‌ సినీ కెరీర్‌లో మరో మైల్‌రాయిగా నిలవనుంది. ఈ చిత్రం లో తానూ ఒకభాగం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం ద్వారా తాను చాలా నేర్చుకున్నాను అని అన్నారు. 2.ఓ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అని నటి ఎమీజాక్సన్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement