అక్షయ తృతీయ సందర్భంగా రజనీ కొత్తసినిమా 'లింగా' ప్రారంభమైంది. ఈ సినిమాలో ఆయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటించనున్నారు.
మైసూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన విక్రమ సింహ (తమిళంలో కొచ్చాడయాన్) ఇంకా విడుదల కాకముందే మరో సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా రజనీ కొత్తసినిమా 'లింగా' ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రజనీతో పాటు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పాల్గొన్నారు. తెల్ల సిల్కు లుంగీ, తెల్ల చొక్కా వేసుకుని వచ్చిన రజనీకాంత్తో పాటు ఆయన స్నేహితుడు, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్, ఆయన సతీమణి సుమలత కూడా పూజా కార్యక్రమానికి వచ్చారు.
మైసూరులోని ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయంలో ఈ పూజలు జరిగాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమాలో రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క ఇద్దరూ నటించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.