
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలననానికి తెర తీశారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సమయంలో తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న వర్మ సాయంత్రం సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించనున్నట్టుగా ప్రకటించారు.
అయితే అంతకు ముందే అభిమానుల కోసం ఓపెన్ ఛాలెంజ్ పేరుతో ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. ఈ మెసేజ్‌లో సినిమా తీసేందుకు కారణమైన పరిస్థితులు. సినిమా ఎవరి కోణంలో తెరకెక్కించబోతున్నారు. లక్ష్మీ పార్వతి తో కలిసి తిరుమల దర్శనానికి వెల్లడానికి కారణం. సినిమా నిర్మాణ వెనుక రాజకీయ ఉద్దేశాలు లాంటి అంశాలను వెల్లడించారు.
అంతేకాదు కథ కోసం లక్ష్మి పార్వతితో పాటు ఆమె శత్రువులతోనూ చర్చించినట్టుగా వెల్లడించారు వర్మ. సినిమాను ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతోనూ తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపిన వర్మ జనవరి 24న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.