యేరుశనగ కోసం మట్టిని తవ్వితే..
ఏకంగా తగిలిన లంకేబిందెలాగ..
ఎంతసక్కగున్నావె లచిమి.. ఎంత సక్కగున్నావె..
సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
సేతికి అందిన సందమామలాగ..
ఎంత సక్కగున్నావే లచిమి.. ఎంత సక్కగున్నావె..
మల్లెపూల మధ్య ముద్దబంతిలాగ.. ఎంత సక్కగున్నావె..
ముత్తెదువ మెళ్లో పసుపుకొమ్ములాగ.. ఎంత సక్కగున్నావె..
సుక్కల సీర కట్టిన ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావె..
అంటూ చిట్టిబాబు తన రామలక్ష్మీ కోసం పాడిన పాట ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. పల్లె నేపథ్యాన్ని కళ్లకు కట్టెలా చంద్రబోస్ అందించిన సాహిత్యం, జానపద రీతిలో చెవులకు ఇంపుగా దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం, గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. శ్రోతలను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాటపై తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ రచయిత కోన వెంకట్ ప్రశంసల జల్లు కురిపించారు.
సుకుమార్ ‘రంగస్థలం’ ట్రైలర్ ఎంతగానో నచ్చింది. కానీ ఈ పాట రంగస్థలంను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. ఈ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్‌కు, సంగీంత అందించిన డీఎస్పీకి మిలియన్ చీర్స్ అంటూ వర్మ ప్రశంసించారు.
‘చాలా అరుదుగా కొన్ని పాటలు మన గుండెల్ని తాకి, మన మనసుల్ని మీటి, మన జ్ఞపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంటాయి. ఇది అచ్చం అలాంటి పాటే’ అంటూ కోన వెంటక్ ట్వీట్ చేశారు. ఈ పాటకుగాను సమంత ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఈ పాటలో రాంచరణ్ కనబర్చిన హావభావాలు అద్వితీయమని కొనియాడారు.
సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రంగస్థలం’ లో చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు కానుకగా మంగళవారం ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎంతసక్కగున్నావె.. లచిమి పాట రెండు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
‘హో.. హో.. హో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం...’ అంటూ రామ్‌చరణ్ వాయిస్‌తో సాగే టీజర్ ఇంతకుముందు విడుదలై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది.
Comments
Please login to add a commentAdd a comment