హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్‌లో సీతగా నటించి విశేష ఆదరణ పొందారు దీపికా చిఖలియా. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ ‘సరోజిని’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గురువారం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లాక్‌డౌన్ కారణంగా హిందీ రామాయణ్‌ను దూరదర్శన్‌లో పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో దీపిక క్రేజ్ మరోసారి అమాంతం పెరిగిపోయింది. అయితే నటిగా మంచి గుర్తింపు పొందిన దీపిక రాజకీయ రంగప్రవేశం చేశారని చాలా కొంతమందికే తెలుసు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి సీత ఇప్పటి సరోజిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘రామాయణం సినిమాగా తెరకెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయంది. అయితే ఈ సినిమాలో నటించాలన్నా, తెరకెక్కించాలన్న రామాయణం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒక వేళ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, అలియాభట్‌లు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారు. అంతేకాకుండా అజయ్ దేవ్‌గణ్ రావణుడు, వరుణ్ ధావన్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక రామయణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు మ్యాగజైన్స్ ఫోటో షూట్‌కు పిలిచారు. అందుకు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారు. కానీ ఓ వైపు సీత పాత్ర పోషిస్తూ ఫోటో షూట్‌లో పాల్గొనడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించాను.
1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. దివంగత నాయకులు అటల్ బిహార్ వాజ్‌పేయ్ స్పూర్థితో రాజకీయం రంగ ప్రవేశం చేశాను. మా తాత ఆరెస్సెస్ కార్యకర్త. దీంతో నాలో చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్ భావాలు ఉండేవి. ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, నరేంద్ర మోదీ తదితరులు నా రాజకీయ సహచరులు. గుజరాత్‌లోని బరోడా లోని లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఇప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సహాయం, సలహాలు అందిస్తుంటాను’అంటూ దీపికా చిఖలియా పేర్కొన్నారు. ఈ నటి తెలుగులో కూడా యమపాశం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు.
చదవండి:
‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’
‘సితారా.. సింగర్‌గా ట్రై చేయ్’
Comments
Please login to add a commentAdd a comment