మా గురువు రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు
‘‘1980ల్లో గుజరాత్‌లోని పలన్‌పూర్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన స్ఫూర్తితో ‘కాళీచరణ్’ కథ తయారు చేసుకున్నా. తెలుగు నేటివిటీకి సౌలభ్యంగా ఉంటుందని మహబూబ్‌నగర్‌లోని పాలమూరు నేపథ్యాన్ని సినిమాలో చూపించాను. అంతేకానీ పాలమూరులో జరిగిన సంఘటనలు దీనికి స్ఫూర్తి కాదు’’ అని శ్రీప్రవీణ్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కాళీచరణ్’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా శ్రీప్రవీణ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘రాజకీయ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఇందులో లవ్, యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు అన్ని వాణిజ్య అంశాలుంటాయి. సినిమాలోని ప్రతి పాత్రా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హీరో హీరోయిన్లు చైతన్యకృష్ణ, చాందిని వారి పాత్రల్లో జీవించారు. నందన్‌రాజ్ స్వరపరచిన పాటలు విని ఇళయరాజా తరహాలో ఉన్నాయని చాలామంది మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసి మా గురువు రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు. చాలామంది బాలీవుడ్ నటులు కూడా సినిమా గురించి ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు’’ అని చెప్పారు.