పాదరక్షలు ఉచితం!
అతి చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలై, భేష్ అనిపించుకున్నారు రమ్య అలియాస్ దివ్యస్పందన. కర్ణాటకలోని మాంద్యా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో నిలబడి, గెలిచారామె. మాండ్యా ప్రజలు తనపట్ల ఆదరాభిమానాలు కనబర్చి, ఎంపీని చేసినందుకు రమ్య వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు.
మాంద్యా ప్రజలకు వీలైనంతవరకు అందుబాటులో ఉండాలని, వారి అభివృద్ధి కోసం పాటుపడాలని రమ్య బలంగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గానికి సంబంధించిన పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉచితంగా పాదరక్షలు అందేలా చేశారు.
ఓ ప్రముఖ షూ బ్రాండ్‌కి ప్రచారకర్తగా వ్యవహరించారామె. ఆ ఉత్పత్తిదారులతో తనకు పారితోషికం వద్దని, అందుకు బదులుగా మాంద్యా పాఠశాలలకు చెందిన పిల్లలకు ఉచితంగా స్కూల్ షూస్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారామె. ఇలా చేయడం చాలా ఆనందంగా ఉందని, ముందు ముందు ప్రజలకు బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని రమ్య తెలిపారు.