తన తదుపరి రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటకలోని మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ తాను భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి తాను మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదన్నారు.
మండ్యాలో తన మద్దతుదారులను ఉద్దేశించి సుమలత ప్రసంగిస్తూ.. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ మండ్యా పట్ల నా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. టికెట్ దక్కనప్పుడు కొంతమంది తమ పార్టీని వీడుతారు. కానీ నేను నా సీటును వదులుకుని బీజేపీతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాను’ అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈసారి ఎన్నికల్లో మండ్యా సీటును మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి కేటాయించారు. 2019 ఎన్నికల్లో నిఖిల్‌పై సుమలత విజయం సాధించి జేడీఎస్ కంచుకోటగా భావించే మండ్యాలో రాజకీయ మార్పును తీసుకొచ్చారు. 2018లో తన భర్త అంబరీష్ మరణానంతరం, సుమలత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి మండ్య నుంచి పోటీ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి సుమారు రూ. 4,000 కోట్ల గ్రాంట్లు అందించినట్లు సుమలత గుర్తు చేశారు. మండ్యాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు బీజేపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “బీజేపీకి నా అవసరం ఉందని, పార్టీని వీడవద్దని ప్రధాని (మోదీ) అభ్యర్థించినప్పుడు నేను ఆయనను గౌరవించాలి” అన్నారు.
ఇదే సందర్భంగా సుమలత మండ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తనను తాను జిల్లా 'కోడలు'గా పేర్కొంటూ తనకు ఇతర చోట్ల నుండి పోటీ చేసేందుకు బీజేపీ నుండి ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంతమంది కోరినప్పటికీ ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పార్టీలో చేరరని ఆమె చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment