బెంగళూరు: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్‌ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తనకు సహకరించాలని కోరారు.
'సోదరి' సహకారం వచ్చా..
బెంగళూరులోని సుమలత అంబరీష్ నివాసంలో ఆమెతో సమావేశం అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని వెల్లడించారు. “అంబరీష్ ఇల్లు నాకు కొత్త కాదు. మేము చాలా సంవత్సరాలు కలిసి నడిచాం. నేను మాండ్య లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇందులో భాగంగా సోదరి (సుమలత) సహకారం కోసం ఇక్కడికి వచ్చాను" అన్నారు. తమ అనుచరులు మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఏప్రిల్ 3న మండ్యలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుమలత తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు.
సమావేశం అనంతరం సుమలత అంబరీష్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. పాత విభేదాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన (కుమారస్వామి) కోరారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించాం" అని ఆమె వివరించారు.
మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీకి మద్దతుగా నిలుస్తారా లేక మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమలతకు కేంద్రంలో మంచి పదవి, హోదా కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో మండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత, సుమలత అంబరీష్ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఇంకా అధికారికంగా కాషాయ పార్టీలో చేరలేదు.
Comments
Please login to add a commentAdd a comment