ముంబై : బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె కలిసిపోయారు... అయితే నిజజీవితంలో కాదులెండి.. ‘ద వాక్ ఆఫ్ మిజ్వాన్’ పేరిట ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో కోసం. ఏప్రిల్ 9న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగే ఫ్యాషన్ షోలో మిజ్వాన్ అనే ఎన్జీవోకు చెందిన చికెన్‌కారీ(ఎంబ్రాయిడరీ) కళాకారులు రూపొందించిన దుస్తులు ధరించి వీరు ర్యాంప్ వాక్ చేయనున్నారు.
చికెన్‌కారీ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనీష్ మల్హోత్రా మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ(ఎన్జీఓ)తో తొమ్మిదేళ్ల నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రతీ ఏడాది బాలీవుడ్ నటులతో ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. గతేడాది బాలీవుడ్ బాద్‌షా, హీరోయిన్ అనుష్క శర్మలతో పాటు కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఎన్జీఓకు రణ్‌బీర్ కపూర్, షబానా అజ్మీ, నమ్రత గోయల్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ఈ ఎన్జీవోకు బాలీవుడ్ అండదండలు ఉంటాయని నటి షబానా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకెంతో సంతోషంగా ఉందని రణ్‌బీర్ చెప్పాడు. గ్రామీణ భారతంపై దృష్టి సారించాలని, అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు అవకాశాలు కల్పించినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని తమ వంతు సాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment