
బాలీవుడ్ 'బ్లాక్' బ్యూటీ రాణీ ముఖర్జీ జన్మదినం నేడు. నేటితో ఈ భామకు 40ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా తన 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఒక లేఖను విడుదల చేశారు రాణీ. '40ఏళ్లు.. అని తలుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. ఈ 40ఏళ్లలో, 22ఏళ్లు బాలీవుడ్‌లోనే గడిచిపోయాయి. ఇక్కడ ప్రతిరోజు నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లు నాతో పనిచేసిన చిత్ర నిర్మాతలకు, నన్ను నమ్మి సమాజ నియమాలను సవాలు చేసే పాత్రలను నాకు ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానలకు ధన్యవాదాలు.
నటీనటులకు సమాజం, మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపే కథలు చాలా అరుదుగా దొరుకుతాయి. అదృష్టవశాత్తు అలాంటి అవకాశాలు నాకు ఎన్నో వచ్చాయి. ఇదంతా ప్రేక్షకుల ఆశీర్వాదం వల్లే. నేను పుట్టిందే నటించడం కోసం అనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అయినా నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోగలిగాననే భావిస్తున్నాను. ఒక విషయమైతే నేను ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించడం చాలా కష్టమైన అంశం. ఆడవారికైతే మరీ కష్టం. ఎందుకంటే హీరోయిన్‌ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది.ఇక పెళ్లయిన హీరోయిన్‌ల సంగతి చెప్పనవసరం లేదు. తల్లిగా మారాక స్త్రీలు తమ ఆశలను, కలలను, కోరికలను చంపుకోవాల్సిందే.
ఇక్కడ స్త్రీ ప్రధానంగా వచ్చే చిత్రాలు విజయవంతమవ్వడం చాలా కష్టం. ఈ వివక్షలను దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మేము ప్రతీరోజూ పోరాడుతూనే ఉంటాము. పరిశ్రమలో హీరో, హీరోయిన్‌లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మా రూపాన్ని, గాత్రాన్ని, నటనను, నాట్యాన్ని, ఎత్తును బట్టి మమ్మల్ని ప్రతిరోజు నిర్ణయిస్తారు. వీటన్నిటిని దాటుకుని మమ్మల్ని మేము నిరూపించుకుంటాము. నేను నా స్నేహితుల నుంచి అనేక విషయాలను నేర్చుకుంటాను' అంటూ ముగించారు. లాంగ్ గ్యాప్ తరువాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హిచ్‌కీ’ ఈ శుక్రవారం రిలీజ్ అవుతుండగా.. షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జీరో సినిమాలోనూ రాణీ ముఖర్జీ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment