ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరుకున్న వారిలో రణ్‌వీర్ సింగ్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు రణ్‌వీర్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తొలినాళ్లలో నేను ఇచ్చిన కొన్ని ఆడిషన్లు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఎందుకంటే.. నాకికి రేపు అనేది లేదు.. ఈ రోజే ఆఖరు అనే భావంతో ఆడిషన్స్ ఇచ్చేవాడిని. దాంతో నాకు ఊపిరాడని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి’ అన్నారు.
‘‘బ్యాండ్ బజా బరాత్’ చిత్రం తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు నన్ను ఆడిషన్‌కు పిలిచాడు. తాగుబోతు ఫుల్లుగా తాగి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించమన్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేను ప్రతి చాన్స్‌ను వినియోగించుకునేవాడిని. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భావించేవాడిని. ఆ రోజు అలానే మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాను. ఎంత ఉద్రేకంగా డ్యాన్స్ చేశానంటే.. నాకు ఊపిరి ఆడటం కష్టంగా మారింది. నా డ్యాన్స్ చూసిన ఆ దర్శకుడు నన్ను ఎంతో ప్రశంసించాడు’ అన్నారు.
‘తొలినాళ్లలో కఠిన పరీక్షలు, నిరాశ, అవమానాలు, నిరాకరణ ఒక్కటేంటి అన్నింటిని చవి చూశాను. కానీ గడిచిన ఆ రోజులు నా జీవితంలో మధురస్మృతులు. నాకు అవకాశాలు వస్తాయా అని ఆలోచించేవాడిని. ‘మా చిత్రంలో మిమ్మల్ని సెలక్ట్ చేశాం రండి’ అంటూ ఎవరైనా నాకు ఫోన్ చేయకపోతారా అని ఎదురుచూసేవాడిని. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోలేదు. నాకు నేనే ధైర్యం చెప్పుకునే వాడిని. ఆ సమయంలో రెండు విషయాలను బాగా నమ్మేవాడిని’ అని తెలిపారు.
‘ఒకటి.. నటన పట్ల నాకున్న పిచ్చి.. రెండు నా మీద నాకున్న నమ్మకం. సంపాదన, పేరు కోసం నేను సినిమాల్లోకి రాలేదు. అందుకే ఎప్పుడు నాకు నేను ఒకటే చెప్పుకునేవాడిని. నీవు మంచివాడివి.. పట్టుదల కల్గిన వ్యక్తివి. కాబట్టి ఏదో రోజు నీకు మంచే జరుగుతుందని నాకు నేనే చెప్పుకునేవాడిని. ఈ రోజు నాకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని విలువైనదిగానే భావిస్తాను’ అన్నారు రణ్‌వీర్ సింగ్. ప్రస్తుతం రణ్‌వీర్ ‘83’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment