యాంకర్‌గా చేయడం తప్పా?
తమిళసినిమా: తెలుగు నటుడితో ప్రేమలో పడ్డానా? అంటూ దీర్ఘాలు తీస్తోంది నటి రేష్మీ. ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగులో చిత్రాల్లోనూ అడపాదడపా నటిస్తూ, బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది. తమిళంలో కండేన్, మాప్పిళై వినాయగర్ చిత్రాల్లో నాయకిగా నటించిన రేష్మీ తాజాగా ప్రియముడన్ ప్రియా అనే చిత్రంలో నటిస్తోంది. ఒక బుల్లి తెర నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు ప్రచారం జోరుగానే సాగుతోంది.
అయితే రేష్మీ అదంతా బేస్‌లెస్ ప్రచారం అని కొట్టిపారేస్తోంది. దీని గురించి ఈ అమ్మడు చెబుతూ తానెవరినీ ప్రేమించడం లేదని చెప్పింది.అంతే కాదు ప్రస్తుతం తన పనిలో తాను చాలా సంతోషంగా ఉన్నానని అంది. సినిమాల్లో నటిస్తూ బుల్లితెర కార్యక్రమాలు చేస్తున్నారేమిటని అడుగుతున్నారని, టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా చేయడం తప్పా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇంకా చెప్పాలంటే తానీ స్థాయికి రావడానికి బుల్లితెరే కారణం అని పేర్కొంది.
పెద్ద చిత్రాల విడుదల సమయాల్లో వాటి ప్రమోషన్ కోసం టీవీ చానళ్లనే ఆశ్రయిస్తుంటారని, హాలీవుడ్‌లో కూడా ప్రముఖ నటీనటులు వెబ్ సీరియళ్లలో నటిస్తున్నారని తెలిపింది. అంత దాకా ఎందుకు 14 ఏళ్ల పోరాటం తరువాత బుల్లితెరే తనకు గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పింది. ఇప్పుడు ప్రముఖ నటీనటులు కూడా టీవీ సీరియళ్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల బుల్లితెరను చులకనగా చూడడం సరికాదని పేర్కొంది. త్వరలో ఒక ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో ఆదికి జంటగా నటించనున్నట్లు రేష్మీ తెలిపింది.