రసికా దుగల్.. మల్టీప్లెక్స్ సినిమా, ఓటీటీ ప్రేక్షకుల నోట్లో నానే పేరు. డబ్బుకోసం కలిమిగల ఇంటి ఆసామికి రెండో భార్య అయిన పేదింటి పిల్లగా ‘మిర్జాపూర్’లో, భర్త ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు గురవుతున్న భార్యగా, డాక్టర్‌గా ‘అవుటాఫ్ లవ్’లో, డీసీపీగా ‘ఢిల్లీ క్రైమ్’లో రసికా కనిపించలేదు.. ఆ పాత్రలను చూపించింది. అందుకే ఓటీటీ స్క్రీన్స్ ఉన్న ప్రతి ఇల్లు ఆమె అభిమాన సంఘమే.
- పుట్టింది,పెరిగింది జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్. డిగ్రీ, తర్వాత చదువు ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్, ముంబైలోని సోఫియా కాలేజ్‌లలో పూర్తి చేసింది. ఇక్కడితో ఆపలేదు. పుణె ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటననూ నేర్చుకుంది.
- రచనా ప్రతిభా ఉన్న నటి రసికా దుగల్. ఖాళీ సమయాల్లో కవిత్వం రాస్తుంది. డాన్స్, రీడింగ్‌తోనూ సేద తీరుతుంది.
- రసికాను పరిచయం చేసిన సినిమా 2007లో విడుదలైన ‘నో స్మోకింగ్’. కాని ప్రేక్షకులు ఆమెను గుర్తించిన సినిమా రామ్‌గోపాల్‌వర్మ ‘అజ్ఞాత్’. ఆ తర్వాత వచ్చిన క్షయ్, కిస్సా, తూ హై మేరా సండే, కశ్మీరీ హాఫ్ విడోగా చేసిన ‘హమీద్’ వంటి చిత్రాలూ ఆమె నటనకు కట్టిన ఫ్రేములు.
- అవకాశాలకు బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఓటీటీ వంటి పరిధులు విధించుకోలేదు ఆమె. కాబట్టే టీవీ సిరీస్, వెబ్ సిరీస్‌కూ డేట్లు ఇస్తోంది. ‘స్క్రిప్ట్ ఓన్లీ మ్యాటర్స్.. నా పాత్ర చిన్నదైనా పర్లేదు. నటించే స్కోప్ ఎంతుందో అనేదే చూస్తాను’ అంటుంది .
- ఫోన్లో ఎంగేజ్ అవడమంటే చిరాకు. అందుకే చాలా సందర్భాల్లో ఆమె ఫోన్ ‘స్విచ్డ్ ఆఫ్ ఆర్ అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ అనే వినిపిస్తుంది. ‘నా హాబీల్లో ఫోన్‌ను డిస్కనెక్ట్ చేయడం’ అని కూడా పెట్టుకోరూ ప్లీజ్’ అంటుంది. ప్రస్తుతం.. రసికా దుగల్ నటించిన ‘ఢిల్లీ క్రైమ్’ సెకండ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఓ ష్టార్ట్ ఫిల్మ్‌కూ స్క్రిప్ట్ రాసింది. భర్త ముకుల్ ఛద్దాతో కలిసి అందులో నటించింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment