రీల్‌పైకి రియల్ లైఫ్
‘‘పదమూడేళ్ల అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం మించిన కమర్షియాలిటీ ఏముంటుంది? ఇప్పటివరకూ హిందీలో వచ్చిన బయోపిక్స్‌లో స్టార్స్ నటించారు. మా సినిమాలో స్టార్స్ లేరు. కానీ, అమ్మాయిలు ఏదైనా సాధించగలరనే స్ఫూర్తివంతమైన కథాంశం ఉంది’’ అన్నారు హిందీ నటుడు రాహుల్ బోస్. అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం మలావత్ పూర్ణ జీవితకథతో రాహుల్ బోస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘పూర్ణ’ ఈ నెల 31న తెలుగు, హిందీ భాషల్లో రిలీజవుతోంది.
మలావత్ పూర్ణ మాట్లాడతూ – ‘‘నా లైఫ్‌ను సినిమాగా తీస్తారని ఊహించలేదు. కథ గురించి దర్శకుడితో చర్చించాను. ఎంత కష్టమైన పనినైనా ఇష్టంగా చేయడం వల్లే ఇప్పుడు నేనీ స్థాయిలో ఉన్నా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మాయిలను చదువు మాన్పించడం, బాల్య వివాహాలు వంటివి చేయొద్దని తల్లిదండ్రులను కోరుతున్నా. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు’’ అన్నారు. ఈ బయోపిక్‌లో పూర్ణ పాత్రలో నటించిన అదితి పాల్గొన్నారు.