రణ్బీర్ కపూర్పై ఎఫ్ఐఆర్
లక్నో: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతోపాటు ఫరాన్ అక్తర్పై కూడా కేసు నమోదు చేశారు. 'ఆస్క్ మి బజార్' అనే ఆన్లైన్ షాపింగ్ సైట్ కోసం వినియోగదారులను మోసం చేసేలా ప్రకటనలు ఇచ్చారని, ఉద్దేశ పూర్వకంగా కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మదియాన్ అనే పోలీస్స్టేషన్లో కేశవ్ నగర్కు చెందిన రాజత్ బన్సాల్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అలాగే, సదరు ఆన్లైన్ షాపింగ్ సైట్ డైరెక్టర్లపై కూడా 420, 406 సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. బన్సాల్ ఆగస్టు 23న 40 అంగుళాల ఎల్ఈడీ టీవీకోసం ఆస్క్ మి బజార్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసి డెబిట్ కార్డుతో రూ.29,999 చెల్లించాడు. అయితే, ముందుగా ప్రకటించినట్లుగా పది రోజుల్లో తనకు టీవీ డెలివరీ కాలేదని, కాని బిల్లు మాత్రం పంపించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రణబీర్ కపూర్, ఫరాన్ అక్తర్ ప్రకటనలు చూసే ఆ ఆన్ లైన్ షాపింగ్ సైట్కు ఆకర్షితుడినయ్యానని వారు తనను మోసం చేశారని చెప్పారు.