
కాబోయే మామగారికి హీరోయిన్ పొగడ్తలు
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్... తన పెళ్లికి లైన్ క్లియర్ చేసుకోడానికి ప్రియుడు రణబీర్ కపూర్ ఇంట్లో వాళ్లను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. రణబీర్ తండ్రి రిషికపూర్ను 'లివింగ్ లెజెండ్' అంటూ ఆమె పొగడ్తలతో ముంచెత్తింది. రిషితో కలిసి తాను 'నమస్తే లండన్' చిత్రంలో నటించానని, ఆయన ఓ అద్భుతం, అసాధారణ వ్యక్తి అంటూ కత్రినా ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనను చూసినప్పుడు తాను సంతోషంగా ఫీల్ అయ్యానంటూ ఆమె చెప్పుకొచ్చింది.
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ' షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి డేటింగ్లో ఉన్న వీరిద్దరి ప్రేమ, పెళ్లి గురించి మీడియాలో రూమర్లు కావల్సిన దానికంటే ఎక్కువగానే షికారు చేస్తున్నాయి. అయితే తమ మధ్య ఏం లేదంటూ కొట్టిపారేసినా... విదేశాలకు హాలిడే ట్రిప్‌కు వెళ్లి మీడియాకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేశాయి కూడా. అయినా ఈ జంట తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టలేదు. తామీద్దరం కలిసి గడిపేందుకు టైమ్ లేదని, ఎవరి సొంత పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నామని కత్రినా తెలివిని జవాబిచ్చింది. మరోవైపు వీరిద్దరి వివాహానికి రణబీర్ కుటుంబసభ్యులు అంత సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక రణబీర్తో పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం కత్రినా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్ లేదని, జనాలు ఎందుకు తమ పెళ్లి ఎప్పుడంటూ వెంటపడతారో అర్థం కావటం లేదని ఆమె వ్యాఖ్యానించింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కత్రినా తెలిపింది. కాగా తన కెరీర్కు సంబంధించిన వాటి కంటే వ్యక్తిగత విషయాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావటం లేదని ఆమె వాపోయింది.
ఇటీవల ఓ సెమినార్లో పాల్గొన్న కత్రినాకు ఇటువంటి అనుభవమే ఎదురైందట. మహిళా సాధికారిత సాధించిన మహిళల గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లిన తనను బాయ్ఫ్రెండ్, పెళ్లి గురించి అడగడం విడ్డూరం అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఓ వైపు ఉమెన్ ఎన్పవర్మెంట్, సమానత్వం గురించి అంత మాట్లాడినా చివరకు బాయ్ఫ్రెండ్ అంటూ అసంగతమైన విషయాలు గురించి మాటలా అని వ్యాఖ్యానించింది. కత్రినా నటించిన 'ఫాంటమ్' ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.