సయోధ్య దిశగా చర్చలు
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి దక్షణి భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) మధ్య వేతనాలు, తదితర అంశాలపై కొంత కాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య కారణంగా గత నెల ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఫెఫ్సీ సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. అయితే సమ్మె సరైన పరిష్కారం కాదన్న నటుడు రజనీకాంత్ హితవు మేరకు ఫెఫ్సీ ఆ సమ్మెను విరమించుకుంది.
అయితే ఇటీవల ఫెఫ్పీకి వ్యతిరేకంగా కొత్త వారిని ఆహ్వానిస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటనలో పేర్కొనడంతో వారి నిర్ణయాన్ని ఖండిస్తూ ఫెఫ్సీ ఈ నెల ఒకటవ తేదీ నుంచి మళ్లీ సమ్మె బాట పట్టింది. అంతే కాదు నిర్మాతల మండలి చర్యలను ఖండిస్తూ ఐదవ తేదీన స్థానిక నుంగంబాక్కంలో గల వళ్లువర్‌కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అయితే సమ్మె కొనసాగుతున్నా ఆందోళన నిర్ణయాన్ని ఫెఫ్సీ విరమించుకుంటున్నట్లు మంగళవారం ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి వెల్లడించారు. సోమవారం సాయంత్రం తమిళనిర్మాతల మండలి నిర్వాహకులు ఫెఫ్సీ నిర్వాహకుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఆ రోజు రాత్రి 12 గంటల వరకూ చర్చలు జరిగిన సమస్య ఒక కొలిక్కిరాలేదు. కాగా చర్చలు సయోద్య దిశగా సాగుతున్నాయని, ఫెఫ్సీ డిమాండ్లు నెరవేరబడతాయన్న ఆశాభావాన్ని ఈ సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి వ్యక్తం చేస్తూ మంగళవారం నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.