
తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) సినీ కార్మికుల కోసం కొత్తగా ఇల్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. చెన్నై పక్కనే ఉన్న పాయనూరులో వారి కోసం తమిళనాడు ప్రభుత్వం 100 ఎకరాల భూమిని జారీ చేసిందని సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, దర్శకులు ఆర్కే సెల్వమణి తెలిపారు.
సినీ కార్మికులకు నటుడు విజయ్ సేతుపతి చేసిన సాయం గురించి ఆర్కే సెల్వమణి తెలిపారు. 'దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో మూడేళ్లలోగా భూమి ఇచ్చి ఇళ్లు కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, పరిపాలన మారడం తదితర కారణాలతో నివాసాలు నిర్మించుకోలేకపోయారు. నా నేతృత్వంలో ఈ పెప్సీ ఏర్పాటైన తర్వాత అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశాం.

ఎం.కె.స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ భూమిని మళ్లీ నివాసాలకు వినియోగించాలని కోరాం. అధికారులు, మంత్రులందరినీ సంప్రదించిన తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు ఉత్తర్వులు వచ్చాయి. నిరాశ్రయులైన మన కార్మికుల కోసం తొలిదశలో 1,000 ఇళ్లు నిర్మించనున్నాం. గృహ నిర్మాణానికి డబ్బు కావాలి. ఇల్లు కావాల్సిన వారు కనీసం 2.5 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఈ డబ్బు కూడా చెల్లించలేని కార్మికుల కోసం మేము చాలా మంది ప్రముఖులకు విజ్ఞప్తి చేశాము. ఈ క్రమంలో నటుడు విజయ్ సేతుపతి కోటి 30 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ డబ్బు సుమారు 50 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఆయన సాయం ఎప్పటికీ మరిచిపోలేం. అందుకే ఈ భూమిలో నిర్మించనున్న 6 టవర్లలో ఒకదానికి విజయ్ సేతుపతి పేరు పెట్టబోతున్నాం. తమిళ పరిశ్రమలో డబ్బున్న సెలబ్రిటీలు అందరూ కూడా పేద కార్మికుల కోసం చేతనైనంత సాయం చేయాలి.' అని ఆయన కోరారు.
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో 23 విభాగాలకు చెందిన దాదాపు 30 వేల మంది సభ్యులతో ఈ సంస్థ కొనసాగుతోంది. తమిళ నటీనటుల సంక్షేమం కోసం ఈ సంస్థ పాటుపడుతుంది. దీని ఏర్పాటులో దర్శకులు ఆర్కే సెల్వమణిదే కీలక పాత్ర కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment