సాలూరి వారి పేరుని రోషన్ నిలబెట్టాలి : ఎస్పీ బాలు | roshan saluri Gaayakudu audio released | Sakshi
Sakshi News home page

సాలూరి వారి పేరుని రోషన్ నిలబెట్టాలి : ఎస్పీ బాలు

Published Mon, Oct 6 2014 12:01 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

సాలూరి వారి పేరుని రోషన్ నిలబెట్టాలి : ఎస్పీ బాలు - Sakshi

సాలూరి వారి పేరుని రోషన్ నిలబెట్టాలి : ఎస్పీ బాలు

‘‘సాలూరి రాజేశ్వరరావుగారు ఆకాశంలాంటివారు. ఆకాశమే హద్దుగా సాధన చేస్తే, అందుకోలేకపోయినా అందులో కొంతైనా సాధించగలమనేది నా నమ్మకం’’ అని ఏఆర్ రెహమాన్ అన్నారు. సిద్ధాన్స్, అక్షర జంటగా కమల్.జి దర్శకత్వంలో జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మిస్తున్న చిత్రం ‘గాయకుడు’. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ- ‘‘రాజ్-కోటి వద్ద చాలా విషయాలు నేర్చుకున్నాను. సాలూరివారి వారసునిగా కోటిగారు ఎంత పేరు సంపాదించారో తెలిసిందే. ఆయన వారసునిగా రోషన్ రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘నా పదిహేనో ఏట... నేను ఓ ఆర్కెస్ట్రాలో పాడుతుంటే.. ఆ కార్యక్రమానికి సాలూరివారు అతిథిగా వచ్చారు. అప్పుడు నేను ఆయన ఆటోగ్రాఫ్ అడిగితే- నా పూర్తిపేరు, భవిష్యత్తులో గాయకునిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించాలని సంతకం చేశారు. సాలూరివారి కంపోజిషన్ చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో గాయకులు ఆయన కంపోజిషన్‌లో పాడటానికి భయపడిపోయేవారు.
 
 అంతటి మహానుభావుని వారసునిగా వచ్చి కోటి ఎంతో పేరు సంపాదించుకున్నాడు. రోషన్ కూడా తాత, తండ్రి పేరు నిలబెట్టాలి’’ అని మరో అతిథి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆకాంక్షించారు. ఇంకా కె.రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, బి.గోపాల్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్, హేరీస్ జైరాజ్, తమన్, అనూప్ రూబెన్స్, మిక్కీ జె.మేయర్, కె.ఎం.రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఆడియో సీడీని ఏఆర్ రెహమాన్ ఆవిష్కరించి, ఎస్పీ బాలసుబ్రమణ్యంకి అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement