ఆకట్టుకునే కథాంశంతో...
‘‘ఈ సినిమా కాన్సెప్ట్ బావుంటుంది. కంటెంట్ అంతకన్నా ఆకట్టుకుంటుంది. ‘రౌడీ ఫెలో’ అనేది మాస్ టైటిల్ అయినా కూడా, ఈ చిత్రం క్లాస్‌కీ మాస్‌కీ నచ్చుతుంది’’ అని దర్శకునిగా మారిన పాటల రచయిత కృష్ణ చైతన్య చెప్పారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా ప్రకాశ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రౌడీ ఫెలో’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘నారా రోహిత్ కెరీర్‌లోనే భిన్నమైన సినిమా ఇది. సన్నీ.ఎం. ఆర్ సంగీతానికి ఇప్పటికే విశేషాదరణ లభిస్తోంది. అన్ని వర్గాలకూ నచ్చే చిత్రమిది. ఈ సినిమాతో కృష్ణచైతన్య దర్శకునిగా మంచి స్థానం సంపాదించుకుంటారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సందీప్ కొరిటాల.