vishakha singh
-
ఆస్పత్రిలో హీరోయిన్, బెడ్‌పై లేవలేని స్థితిలో..
విశాఖ సింగ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కోలీవుడ్‌లో మాత్రం ఈ పేరు సుపరిచితమే. ఈ అమ్మడు ‘జ్ఞాపకం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆ చిత్రం సక్సెస్ సాధించకపోవడంతో ట్రాక్ మార్చి కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఆటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లో తాను నటించిన తొలి చిత్రాలు బోల్తా పడ్డా.. చివరికి తమిళ చిత్రం కన్న లడ్డు తిన్న ఆశయ్యా హిట్‌గా నిలవడంతో విశాఖ సింగ్ గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈ సినిమాలు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దీంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా, విశాఖ సింగ్ తను ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అది కాస్త వైరల్‌గా మారింది. ఆ ఫోటో కింద ఈ విధంగా రాసుకొచ్చారు.. ‘‘నేను అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కొన్ని ప్రమాదాలు, భయంకరమైన సంఘటనలు,, వీటితో పాటు చలికాలంలో వస్తున్న ఆరోగ్య సమస్యలు తరచుగా వేధిస్తున్నాయి. అయినా వీటిని పక్కన పెడుతూ సంతోషకరమైన సమ్మర్ కోసం సిద్దం అవుతున్నా. ఎందుకో గానీ ఏప్రిల్ నెల ప్రతీసారి నాకు ఓ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. బహుశా అది కొత్త ఆర్థిక సంవత్సరం కారణంగానో లేక నేను పుట్టిన సంవత్సరం అవటం వల్ల కూడా కావచ్చు. ఎన్ని అవరోధాలు వచ్చినా దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నాను’’ అని తెలిపింది. -
ప్రేమించాను ఇక పెళ్లే !
అతనితో పరిచయం ప్రేమగా మారింది. ఇక పెళ్లే తరువాయి. ఆ ముచ్చట వచ్చే ఏడాది తీరనుంది అంటున్నారు నటి విశాఖసింగ్. కన్నాలడ్డు తిన్న ఆశైయా చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బ్యూటీ విశాఖసింగ్. ఆ తరువాత వాలిభరాజా, ఒరు ఊరుల రెండు రాజా, భయం ఒరు పయనం అంటూ చాలా తక్కువ చిత్రాలే చేసినా మంచి గుర్తింపునే తెచ్చుకున్న ఈ అమ్మడిలో మరో కోణం కూడా ఉందట. ఆ విషయాలేమిటో చూద్దామా’ ప్ర: కోలీవుడ్‌లో తక్కువ చిత్రాల్లో నటించారు. కారణం? జ: నాకు అధిక చిత్రాల్లో నటించాలన్న కోరిక లేదు. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాదు ముఖ్యం. ఎన్ని మంచి చిత్రాలు చేశారన్నదే ప్రధానం. ఒక్క చిత్రంలో నటించినా అది ప్రశంసలను పొందిందా అన్నది ఒక అంశం కాగా నాకు సంతృప్తిని కలిగించిందా అన్నది మరో అంశం. నేను రేస్‌లో పరిగెత్తే నటిని కాదు. సినిమాతో పాటు వ్యాపారం అనే మరో వృత్తిలోనూ నేను కొనసాగుతున్నాను. ప్ర: అందుకే అవకాశాలను తిరస్కరిస్తున్నారా? జ: అలాగని కాదు. నేను ఒక్క తమిళంలోనే కాదు తెలుగు, కన్నడం,హిందీ, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నాను. నటనతో పాటు విదేశాల్లో వ్యాపారం చేయడం వల్ల దానిపైనా దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్ర: హీరోయిన్ల మధ్య పోటీ కారణంగా మీకు అవకాశాలు రావడం లేదని భావిస్తున్నారా? జ: అలా భావించడం లేదు. నాకు రావలసిన అవకాశాలు కచ్చితంగా నాకే వస్తాయనడంలో నమ్మకం ఉంది. అలా కొన్ని అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి కూడా. భారతీయ సినిమాలో మన సంసృ్కతి, సంప్రదాయాలను అధికంగా ప్రతిఫలించేది తమిళ చిత్రాల్లోనే. నేను పలు భాషల్లో నటిస్తున్నా తమిళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. వైవిధ్యభరిత పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. ప్ర: ఇటు సినిమా, అటు వ్యాపారం తీరిక లేని జీవితం బోర్ అనిపించడం లేదా? జ: వృత్తిని ప్రేమించి చే స్తే బోర్ అనే పదానికే తావుం డదు. సినిమా, వ్యాపారమే కాకుండా ఇంటిలో రకరకాల వంటకాలు చేస్తాను. బైక్ వేగంగా నడుపుతాను. ఇంటిని చక్కగా అలంకరిస్తాను. ఇలా పలు కార్యాలపై దృష్టి పెడతాను. ప్ర: సినిమా, వ్యాపారాల్లో ఏది అధికంగా ఇష్టం? జ: రెండు రంగాల్లోనూ ఆసక్తి, అధిక ప్రమేయం ఉంటుంది. రెండు రంగాల్లోనూ క్రియేటివిటి ఉంటేనే జయించగలం. సినిమా కూడా ఒక వ్యాపారమే చాలా జాగ్రత్త వహించాలి. మంచి కథా చిత్రాలను ఎంచుకుని నటించాల్సి ఉంటుంది. ప్ర: మీ ప్రేమ వ్యవహారం గురించి? జ: కచ్చితంగా నేను ప్రేమ వివాహమే చేసుకుంటాను. నా ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు విక్రాంత్రావు. తను విదేశాల్లో ఉంటారు. నేను తరుచూ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనతో ఏర్పడిన పరిచయం ముందు స్నేహంగానూ ఆ తరువాత ప్రేమగా మారింది. ఈయన నాకు సరైన జోడీ అని మనసులో గంట మోగింది. అంతే ఆయనతో మనసు విప్పి మాట్లాడాను. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో వాళ్ల మధ్య చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది పీపీపీ...డుండుండుంమే. -
హర్రర్ చిత్రంలో విశాకాసింగ్
కోలీవుడ్ హర్రర్ చిత్రాల హవా నడుస్తోందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే సాధారణంగా ఈ తరహా చిత్రాల్లో కథ,కథనాల కే ప్రాధాన్యం ఉంటుంది. కనుక దర్శకనిర్మాతలు ప్రముఖ నటీనటుల జోలికి పోరు. అలాంటిది ఈ మధ్య వారిని వదలడం లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రముఖి హర్రర్ కథా చిత్రమే. అందులో సూపర్‌స్టార్ రజనీకాత్ నటించిన విషయం గమనార్హం.అలాగే నటుడు సూర్య దెయ్యం ఇతి వృత్తంతో కూడిన మాస్ చిత్రంలో నటించారు. నయనతార మాయ అంటూ హర్రర్ సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి నటి విశాకాసింగ్ చేరింది. కన్నాలడ్డు తిన్న ఆశయా చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీకి ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది.అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. నటి ప్రియా ఆనంద్ సిఫారసు మేరకు ఒక్క ఊరుల రెండు రాజా చిత్రంలో చిన్న పాత్ర చేసింది. బహుశా అదే ఆమె చేసిన పెద్ద తప్పు కావచ్చు.ఆ తరువాత పూర్తిగా కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటి భామను వెతికి మళ్లీ తీసుకొస్తున్నారు నవ దర్శకుడు మణిశర్మ. ఈరం చిత్ర దర్శకుడు అరివళగన్ శిష్యుడైన ఈయన ఒక హర్రర్ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని అంటున్నారాయన. విశాకాసింగ్కు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నారు. త్వరలో సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రంలో నటించే హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని వెల్లడించారు. -
ఫ్యాన్ శబ్దం వినిపించాల్సిందే!
గుడ్‌స్లీప్ నిద్ర పోవడం అంటే నా దృష్టిలో మరో ప్రపంచంలో విహరించడం లాంటిది. నాకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. తక్కువ అయితే మాత్రం ఆరోజంతా ఏ పని చేయాలన్నా విసుగ్గా అనిపిస్తుంది. నిద్ర పోవడానికి ముందు చమోమైల్ టీ తాగుతాను. సాఫ్ట్ మ్యూజిక్ వింటాను. లేదా ఏదైనా చిన్న కథ చదువుతాను. అలా చదివే క్రమంలో నిద్ర చేరువవుతుంది. వింత విషయం ఏమిటంటే, వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైన నా గదిలో ఫ్యాన్ తిరుగాల్సిందే. ఫ్యాన్ శబ్దం వినిపించకపోతే నాకు ససేమిరా నిద్ర పట్టదు! పడక కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. ఫ్లోరల్ ప్యాట్రన్స్‌తో కూడిన వైట్ బెడ్షీట్లను ఇష్టపడతాను. - విశాఖసింగ్, హీరోయిన్ -
అద్భుతాలు సృష్టించగలుగుతారు!
‘‘ ‘పేరుకే ఇందరు జనం.. పేరుకు పోయిన ఒంటరితనం.. నరనరాన పిరికితనం.. అందుకు జవాబే మనం’... ఈ సినిమా కోసం సిరివెన్నెల రాసిన ఈ అక్షరాలే మా సినిమా కథ. ఇందులో నేను డబ్బున్న ఇగోయిస్ట్ ఎస్సైగా నటించాను. ‘నేను’ అనే తత్వం నుంచి ‘మనం’ అనే తత్వం వైపు ఓ మనిషి ఎలా నడిచాడు? అనే ప్రశ్నకు సమాధానమే ‘రౌడీ ఫెలో’లో నా పాత్ర. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని నారా రోహిత్ చెప్పారు. ఆయన కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రౌడీ ఫెలో’. రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ప్రకాశ్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. కృష్ణచైతన్య మాట్లాడుతూ -‘‘జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ‘మనుషులే కనిపిస్తున్నారు... మానవత్వం కాదు’ అన్న పాయింట్ ఆధారంగా తీసుకొని ఈ కథ తయారు చేశాను. ప్రతి మనిషికీ అహం అవసరం. అయితే... అది ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతారు. రామరావణ సంగ్రామం, కురుక్షేత్ర యుద్ధం స్త్రీల కారణంగా జరిగాయని చెబుతుంటారు. కానీ నా దృష్టిలో అవి జరగడానికి కారణం ఇగో ప్రాబ్లమ్సే. ఇందులో హీరో పాత్ర ఈ విషయాన్నే చెబుతుంది. రోహిత్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుంది. కథానాయిక విశాఖ సింగ్ రంగస్థల నటి కావడం వల్ల అద్భుతంగా నటించింది’’ అని తెలిపారు. ఇంత మంచి సినిమాలో తానూ భాగం అయినందుకు ఆనందంగా ఉందని విశాఖ సింగ్ అన్నారు. -
రౌడీఫెలో మూవీ న్యూ స్టిల్స్
-
మైలురాయి లాంటి సినిమా
నారా రోహిత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘రౌడీఫెలో’. విశాఖసింగ్ కథానాయిక. గీత రచయిత కృష్ణచైతన్యను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత ప్రకాశ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. కొత్తదనాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. గోవాలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ‘ఆ సీతాదేవి నవ్వులా...’ పాటతో పాటు ‘ఎంతవారు గానీ..’ అనే పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది’’ అని తెలిపారు. ‘‘రచయిత దర్శకుడైతే సినిమాను ఎంత అందంగా, నిజాయతీగా తెరకెక్కిస్తాడో ‘రౌడీఫెలో’ చిత్రం నిరూపిస్తుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రానికి వాణిజ్య విలువలు మేళవించి అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు కృష్ణచైతన్య. ఈ సినిమాతో అతను అగ్ర దర్శకుల జాబితాలో చేరతాడు. అతను రాసిన సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. రోహిత్ కెరీర్‌కి ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అని సహ నిర్మాత సందీప్ కొరిటాల నమ్మకం వెలిబుచ్చారు. -
ఆకట్టుకునే కథాంశంతో...
‘‘ఈ సినిమా కాన్సెప్ట్ బావుంటుంది. కంటెంట్ అంతకన్నా ఆకట్టుకుంటుంది. ‘రౌడీ ఫెలో’ అనేది మాస్ టైటిల్ అయినా కూడా, ఈ చిత్రం క్లాస్‌కీ మాస్కీ నచ్చుతుంది’’ అని దర్శకునిగా మారిన పాటల రచయిత కృష్ణ చైతన్య చెప్పారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా ప్రకాశ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రౌడీ ఫెలో’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘నారా రోహిత్ కెరీర్లోనే భిన్నమైన సినిమా ఇది. సన్నీ.ఎం. ఆర్ సంగీతానికి ఇప్పటికే విశేషాదరణ లభిస్తోంది. అన్ని వర్గాలకూ నచ్చే చిత్రమిది. ఈ సినిమాతో కృష్ణచైతన్య దర్శకునిగా మంచి స్థానం సంపాదించుకుంటారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: సందీప్ కొరిటాల. -
అందరికీ నచ్చుతుంది!
‘‘మా రోహిత్‌కిది ఏడో సినిమా. టైటిల్ నెగటివ్‌గా ఉన్నా, సినిమా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సినిమాల్లో కేవలం వినోదమే కాదు, సందేశం కూడా ఉండాలి. ఆ తరహా సినిమాలను ఎన్టీఆర్ ఎక్కువ చేసేవారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రకాశ్‌రెడ్డి నిర్మించిన ‘రౌడీ ఫెలో’ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో చంద్రబాబు ఆవిష్కరించారు. టీజర్‌ను పరిటాల శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘పెదనాన్న వస్తే నా సినిమాలు తప్పకుండా హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్టవుతుంది’’ అని చెప్పారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ -‘‘పాటల రచయితగా పేరు తెచ్చుకున్నా, మొదట్నుంచీ నా గురి దర్శకత్వంపైనే. నారా రోహిత్ సినిమాతో దర్శకుడవుతున్నందుకు ఆనందంగా ఉంది. సన్నీ స్వరాలు ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. అందరికీ నచ్చే కథాంశమిది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రావు రమేష్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'రౌడీ ఫెలో' ఆడియో ఆవిష్కరణ
-
రౌడీఫెలో మూవీ స్టిల్స్
-
ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా
సాధారణంగా హీరోయిన్లకు ముద్దొస్తే హీరోలను చుంబిస్తుంటారు. అలా స్వకార్యం, స్వామికార్యం నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే నటి ప్రియా ఆనంద్ మాత్రం యువ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలపై ముచ్చటపడి తెగ గిల్లేసింది. నిర్మాత శాసన సభ్యుడు మైఖేల్ రాయప్పన్ తన ఇన్ఫోటెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఒరు ఊరుల రెండు రాజా. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్య పాత్రను సూర్య పోషిస్తున్నారు. అతిథి పాత్రలో నటి విశాఖ సింగ్, ఐటమ్ సాంగ్‌లో నటి ఇనియా దుమ్ము రేపిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్.కన్నన్ నిర్వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను ఈ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు కే.ఆర్., నటుడు శివకార్తికేయన్లు ఆవిష్కరించగా తొలి ప్రతిని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అతిథులందరూ అందుకున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ ప్రియా ఆనంద్ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలు గిల్లాలనే తన చిరకాల ఆశను ఈ వేదికపై తీర్చుకున్నారు. జాంగ్రీలా ఉన్నాయంటూ ఆయన బుగ్గల్ని తెగ గిల్లేసి ముద్దులు పెట్టుకోవడంతో ఆహూతులందరి దృష్టి వీరిపైనే పడింది. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్, విజయ్ సేతుపతి, విష్ణు, గౌతమ్‌కార్తిక్, నటి ఇనియా, విశాఖ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
భిన్నమైన పాత్రలో...
నారా రోహిత్ త్వరలోనే ‘రౌడీ ఫెలో’లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో టి.ప్రకాశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-‘‘రోహిత్ కెరీర్లో ఇది విభిన్నమైన చిత్రం. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నాడు. జూన్‌లో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. విశాఖా సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆహుతి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, తాళ్లూరి రామేశ్వరి, రావురమేశ్, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రధారులు. సన్నీ స్వరాలందించిన ఈ చిత్రాన్ని మూవీమీల్స్, సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ఐటమ్ సాంగ్స్‌కు నో
ఐటమ్ సాంగ్స్ చేయమంటూ చాలా అవకాశాలు వస్తున్నాయంటున్నారు నటి విశాఖ సింగ్. కన్నా లడ్డు తిన్న ఆశయా అంటూ కోలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ ఉత్తరాది భామ సోమవారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. అయితే ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా సన్నిహితుల మధ్య ఆటా పాటలతో గడిపేశారట. బోలెడు గిప్టులతో స్నేహితులు తనపై వున్న ప్రేమను చాటుకున్నారని చెప్పారు. తనకు అత్యంత స్నేహితురాలు తన పుట్టిన రోజు ముందే రోజే మరణించడం చాలా బాధ కలిగించిందన్నారు. తామిద్దరం అరమరికలు లేకుండా ఒకరి సమస్యల గురించి మరొకరు చెప్పుకుని చర్చించుకునేవాళ్లం అన్నారు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో తొలి చిత్రం ‘పిడిచిరుక్కు’ చిత్రంలో నటించే అవకాశం రావడానికి తన స్నేహితురాలి తల్లే కారణం అని తెలిపారు. పస్తుతం ఒక బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ తమిళంలో నటించిన ‘వాలిభరాజా’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటిస్తున్న ‘ఒరు ఊరుల రెండు రాజా’చిత్రంలో గెస్ట్‌రోల్ చేస్తున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియా ఆనంద్ కోసమే ఈ చిత్రంలో అతిథి పాత్రకు అంగీకరించానని విశాఖసింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో పాత్ర చిన్నదైనా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇది గ్రామీణ యువతి పాత్ర అని చెప్పారు. ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో అతిథి పాత్ర పోషించడంతో ఈ తరహా పాత్ర చేయమని పలు అవకాశాలు వస్తున్నాయన్నారు. అలాగే ఐటమ్‌సాంగ్స్ అవకాశాలు బోలెడు వస్తున్నాయని వాటన్నింటిని నిరాకరించినట్లు తెలిపారు. నటనకు అవకాశం వున్న మంచి పాత్రలనే ఆశిస్తున్నట్లు విశాఖసింగ్ పేర్కొన్నారు. -
విశాఖకు గాయం
నటి విశాఖ సింగ్‌కు షూటింగ్లో ప్రమాదవశాత్తు పక్కటెముక విరిగింది. దీంతో ఆమెను చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. తమిళంలో కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రంలో హీరోయిన్గా నటించిన విశాఖ సింగ్ ప్రస్తుతం తెలుగులో రౌడీ ఫెలో అనే చిత్రంలో నారారోహిత్కు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం ప్రాంతంలో జరుగుతోంది. విశాఖసింగ్ రోడ్డుపై వేగంగా పరిగెత్తే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా సహాయదర్శకుడు చేతితో నెట్టడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమె పక్కటెముక విరిగింది. దీనిపై నటి విశాఖ సింగ్ మాట్లాడుతూ రన్నింగ్ సన్నివేశంలో రిహార్సల్లో బాగానే చేశానన్నారు. టేక్‌లో దర్శకుడు యాక్షన్ చెప్పగానే పరిగెత్తడం ప్రారంభించానన్నారు. ఇంకా వేగంగా పరిగెత్తాలంటూ సహాయ దర్శకుడు తనను నెట్టారన్నారు. దీంతో బ్యాలెన్స్ తప్పి తాను కింద పడిపోయినట్లు తెలిపారు. బాధతో గిలగిల్లాడుతుంటే చిత్ర యూనిట్ వెంటనే ఆస్పత్రిలో చేర్చారని చెప్పారు. అయితే పరీక్ష చేసిన వైద్యులు తన పక్క టెముక విరిగిందని చెప్పగానే కంట తడిపెట్టేశానన్నారు. షూటింగ్ చివరి రోజని, పూర్తి అవ్వగానే లండన్ వెళ్లిపోయేదాన్నని ఇప్పుడు వైద్యులు రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారని పూర్తిగా కోలుకోవడానికి నాలుగు వారాలు పడుతుందని చెప్పారని విశాఖ తెలిపారు. -
పది గులాబ్‌జాములు లాగించేశా
ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్నది ఒక పాట పల్లవి. అయితే ఆహా ఏమి రుచి తినరా మైమరచి అంటూ పదికి పైగా గులాబ్‌జామ్‌లను లాగించేసిన నటి విశాఖసింగ్ చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చిందట. సాధారణంగా హీరోయిన్లు తీపి పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఎక్కడ బరువెక్కుతామోనన్న భయమే అందుకు కారణం. అలాంటిది విశాఖ మాత్రం తీయని గులాబ్‌జామ్ కళ్లెదుట ఊరిస్తుంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఒక డజను వరకు లాగించేసిందట. కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ఉత్తరాదిభామ తాజాగా వాలిభరాజా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఇటీవల ఒక హ్యాపీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. చిత్రంలో నటిస్తున్న ప్రధాన తారాగణం పండ్లు, స్వీట్లు తింటూ ఆనందంగా గడిపే ఆ సన్నివేశంలో గులాబ్‌జామ్‌లు నిండుగా ఉన్న ప్లేటును నటి విశాఖ ముందు పెట్టారు. సన్నివేశం ప్రారంభానికి ముందే ఒక గులాబ్‌జామ్‌ను టేస్ట్ చేసిన ఈ అమ్మడు అది యమ రుచిగా ఉండటంతో సన్నివేశం పూర్తి కాకముందే పదికిపైగా గులాబ్‌జామ్‌లను తినేసి యూనిట్‌కు షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ షాపుకెళ్లి మరికొన్ని గులాబ్‌జామ్‌లను చిత్ర యూనిట్ తీసుకొచ్చి సన్నివేశాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందట. దీని గురించి నటి విశాఖ మాట్లాడుతూ సన్నివేశంలో గులాబ్‌జామ్ తింటూ ఆనందాన్ని పంచుకోవాలని దర్శకుడు చెప్పారని అంది. తనకు తీపి అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఒక గులాబ్‌జామ్ నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోయిందని అంది. చాలా రుచికరంగా ఉండటంతో పదికి పైగా గులాబ్‌జామ్‌లు లాగించేశానని చెప్పింది. -
నేనలా నటించను
అందాల ఆరబోతకు ఒక హద్దు ఉంటుంది. అవకాశం వచ్చింది కదా అని ఎలా పడితే అలా నటించడానికి తాను సిద్ధంగా లేను అంటోంది నటి విశాఖ సింగ్. కన్నాలడ్డు తిన్న ఆశయా చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీ మాట్లాడుతూ అవకాశాలు చాలా వస్తున్నాయని చెప్పింది. అయితే చిత్రాల సంఖ్య పెంచుకోవడానికి వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదని చెప్పింది. ఇటీవల ఒక బాలీవుడ్ నిర్మాత కాల్షీట్స్ అడుగుతూ కథ చెప్పడానికి వచ్చారని చెప్పింది. అప్పుడాయన తెలుపు, ఎరుపు షార్ట్స్ ధరించి నటించాలని చెప్పారని దీంతో అవకాశమే వద్దు బయలుదేరండి అని చెప్పానని తెలిపింది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రాలు చేయాలని ఆశిస్తున్నానని, అసభ్యకరమైన దుస్తులతో నటించే చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో వాలిబరాజా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రం విడుదల తన దశను తిప్పిందని, ఈ వాలిభరాజ కూడా మంచిపేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.