పది గులాబ్‌జాములు లాగించేశా
ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్నది ఒక పాట పల్లవి. అయితే ఆహా ఏమి రుచి తినరా మైమరచి అంటూ పదికి పైగా గులాబ్‌జామ్‌లను లాగించేసిన నటి విశాఖసింగ్ చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చిందట. సాధారణంగా హీరోయిన్లు తీపి పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఎక్కడ బరువెక్కుతామోనన్న భయమే అందుకు కారణం. అలాంటిది విశాఖ మాత్రం తీయని గులాబ్‌జామ్ కళ్లెదుట ఊరిస్తుంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఒక డజను వరకు లాగించేసిందట. కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ఉత్తరాదిభామ తాజాగా వాలిభరాజా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఇటీవల ఒక హ్యాపీ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
చిత్రంలో నటిస్తున్న ప్రధాన తారాగణం పండ్లు, స్వీట్లు తింటూ ఆనందంగా గడిపే ఆ సన్నివేశంలో గులాబ్‌జామ్‌లు నిండుగా ఉన్న ప్లేటును నటి విశాఖ ముందు పెట్టారు. సన్నివేశం ప్రారంభానికి ముందే ఒక గులాబ్‌జామ్‌ను టేస్ట్ చేసిన ఈ అమ్మడు అది యమ రుచిగా ఉండటంతో సన్నివేశం పూర్తి కాకముందే పదికిపైగా గులాబ్‌జామ్‌లను తినేసి యూనిట్‌కు షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ షాపుకెళ్లి మరికొన్ని గులాబ్‌జామ్‌లను చిత్ర యూనిట్ తీసుకొచ్చి సన్నివేశాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందట. దీని గురించి నటి విశాఖ మాట్లాడుతూ సన్నివేశంలో గులాబ్‌జామ్ తింటూ ఆనందాన్ని పంచుకోవాలని దర్శకుడు చెప్పారని అంది. తనకు తీపి అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఒక గులాబ్‌జామ్ నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోయిందని అంది. చాలా రుచికరంగా ఉండటంతో పదికి పైగా గులాబ్‌జామ్‌లు లాగించేశానని చెప్పింది.