![ప్రేమించాను ఇక పెళ్లే !](/styles/webp/s3/article_images/2017/09/4/41472933840_625x300.jpg.webp?itok=kwYBrUfF)
ప్రేమించాను ఇక పెళ్లే !
అతనితో పరిచయం ప్రేమగా మారింది. ఇక పెళ్లే తరువాయి. ఆ ముచ్చట వచ్చే ఏడాది తీరనుంది అంటున్నారు నటి విశాఖసింగ్. కన్నాలడ్డు తిన్న ఆశైయా చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బ్యూటీ విశాఖసింగ్. ఆ తరువాత వాలిభరాజా, ఒరు ఊరుల రెండు రాజా, భయం ఒరు పయనం అంటూ చాలా తక్కువ చిత్రాలే చేసినా మంచి గుర్తింపునే తెచ్చుకున్న ఈ అమ్మడిలో మరో కోణం కూడా ఉందట. ఆ విషయాలేమిటో చూద్దామా’
ప్ర: కోలీవుడ్‌లో తక్కువ చిత్రాల్లో నటించారు. కారణం?
జ: నాకు అధిక చిత్రాల్లో నటించాలన్న కోరిక లేదు. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాదు ముఖ్యం. ఎన్ని మంచి చిత్రాలు చేశారన్నదే ప్రధానం. ఒక్క చిత్రంలో నటించినా అది ప్రశంసలను పొందిందా అన్నది ఒక అంశం కాగా నాకు సంతృప్తిని కలిగించిందా అన్నది మరో అంశం. నేను రేస్‌లో పరిగెత్తే నటిని కాదు. సినిమాతో పాటు వ్యాపారం అనే మరో వృత్తిలోనూ నేను కొనసాగుతున్నాను.
ప్ర: అందుకే అవకాశాలను తిరస్కరిస్తున్నారా?
జ: అలాగని కాదు. నేను ఒక్క తమిళంలోనే కాదు తెలుగు, కన్నడం,హిందీ, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నాను. నటనతో పాటు విదేశాల్లో వ్యాపారం చేయడం వల్ల దానిపైనా దృష్టి సారించాల్సి ఉంటుంది.
ప్ర: హీరోయిన్ల మధ్య పోటీ కారణంగా మీకు అవకాశాలు రావడం లేదని భావిస్తున్నారా?
జ: అలా భావించడం లేదు. నాకు రావలసిన అవకాశాలు కచ్చితంగా నాకే వస్తాయనడంలో నమ్మకం ఉంది. అలా కొన్ని అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి కూడా. భారతీయ సినిమాలో మన సంసృ్కతి, సంప్రదాయాలను అధికంగా ప్రతిఫలించేది తమిళ చిత్రాల్లోనే. నేను పలు భాషల్లో నటిస్తున్నా తమిళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. వైవిధ్యభరిత పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను.
ప్ర: ఇటు సినిమా, అటు వ్యాపారం తీరిక లేని జీవితం బోర్ అనిపించడం లేదా?
జ: వృత్తిని ప్రేమించి చే స్తే బోర్ అనే పదానికే తావుం డదు. సినిమా, వ్యాపారమే కాకుండా ఇంటిలో రకరకాల వంటకాలు చేస్తాను. బైక్ వేగంగా నడుపుతాను. ఇంటిని చక్కగా అలంకరిస్తాను. ఇలా పలు కార్యాలపై దృష్టి పెడతాను.
ప్ర: సినిమా, వ్యాపారాల్లో ఏది అధికంగా ఇష్టం?
జ: రెండు రంగాల్లోనూ ఆసక్తి, అధిక ప్రమేయం ఉంటుంది. రెండు రంగాల్లోనూ క్రియేటివిటి ఉంటేనే జయించగలం. సినిమా కూడా ఒక వ్యాపారమే చాలా జాగ్రత్త వహించాలి. మంచి కథా చిత్రాలను ఎంచుకుని నటించాల్సి ఉంటుంది.
ప్ర: మీ ప్రేమ వ్యవహారం గురించి?
జ: కచ్చితంగా నేను ప్రేమ వివాహమే చేసుకుంటాను. నా ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు విక్రాంత్‌రావు. తను విదేశాల్లో ఉంటారు. నేను తరుచూ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనతో ఏర్పడిన పరిచయం ముందు స్నేహంగానూ ఆ తరువాత ప్రేమగా మారింది. ఈయన నాకు సరైన జోడీ అని మనసులో గంట మోగింది. అంతే ఆయనతో మనసు విప్పి మాట్లాడాను. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో వాళ్ల మధ్య చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది పీపీపీ...డుండుండుంమే.