
మోస్ట్ అవెయిటెడ్ మూవీ సాహో సినిమాలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశాడు. తొలి పాటకు తనిష్క్ బాగ్చి స్వరాలందించటంతో పాటు ఆలపించారు. ఇటీవల విడుదలైన ఏ చోట నువ్వున్నా టీజర్‌లోని పాటకు గురు రంథవ సంగీతమందించి ఆలపించారు. ఈ పాట ఆగస్టు 2న రిలీజ్ కానుంది. అయితే అంతకన్నా ముందే సంగీత దర్శకుడు గురు వార్తల్లో నిలిచారు.
ఇటీవల గురు అమెరికా, కెనాడలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా వాన్‌కోర్‌లో ప్రదర్శన సందర్భంగా జరిగిన గొడవలో గురు గాయపడ్డాడు. తాను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్న సమయంలో ఓ పంజాబీ వ్యక్తి స్టేజ్ మీదకు వచ్చే ప్రయత్నం చేశాడని, అతడిని వద్దని వారించటంతో ప్రొగ్రామ్ అయిపోయి తిరిగి వెళ్లే సమయంలో తనపై దాడి చేశారని గురు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ దాడిలో గురుకు కంటి పై భాగంలో తీవ్రగాయం కావటంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఇండియా తిరిగి వచ్చిన గురు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.