కీర్తీసురేశ్ , ఐశ్వర్యరాజేశ్
తమిళసినిమా: నన్ను కమర్సియల్ నిలబెట్టిన చిత్రం సామి అని నటుడు విక్రమ్ అన్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సామి స్క్వేర్. కీర్తీసురేశ్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో ముఖ్యపాత్రను నటి ఐశ్వర్యరాజేశ్ పోషిస్తున్నారు. ఇది సామి చిత్రానికి సీక్వెల్. సామి చిత్రాన్ని తెరకెక్కించిన హరినే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తమీస్ ఫిలింస్ పతాకంపై ఇంతకు ముందు ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సామి స్క్వేర్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో చిత్ర హీరోహీరోయిన్లు విక్రమ్, కీర్తీసురేశ్ కలిసి పాడడం విశేషం. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక గిండి సమీపంలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియమ్, ఫైనాన్సియర్ అన్బుసెలియన్, నిర్మాత జ్ఞానవేల్‌రాజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ సామి చిత్ర ఎండింగ్‌లోనే రెండవ భాగానికి లీడ్ వదిలామన్నారు. అయితే వరుసగా పోలీస్ కథా చిత్రాలు చేయడంతో ఒక ఎపిసోడ్ ఖాళీ అయిపోయిందన్నారు. అయితే విక్రమ్‌ను కలిసి నప్పుడల్లా ఒక మంచి కథ లభించగానే సామికి రెండవ భాగం చేద్దాం అని చెప్పేవాడినన్నారు. అలాంటి కథ ఇప్పుడు లభించిదని పేర్కొన్నారు. పెరుమాళ్ పిచ్చై సామికు ఆరుసామియిన్ మగన్ సామికి మధ్య జరిగే పోరాటమే సామి స్క్వేర్ అని చెప్పారు. నటి ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో త్రిషకు బదులుగా తాను నటించానని చెప్పింది. అయితే సామి చిత్రంలో అబ్బురపరచిన ఆమెలా తాను నటించగలనా అంటే కచ్చితంగా సాధ్యం కాదని, అయితే అందుకు ప్రయత్నించానని అన్నారు. నటి కీర్తీసురేశ్ మాట్లాడుతూ దర్శకుడు హరితో పనిచేస్తున్నప్పుడు కాలం విలువ, ప్రణాళికల గురించి తెలిసివస్తుందన్నారు.
నిర్మాత శిబు తమీన్ తన గురించి దేవీశ్రీ ప్రసాద్‌కు చెప్పడంతోనే ఆయన తనతో ఈ చిత్రంలో పాడించారని తెలిపారు. ఇకపోతే తాను చిన్న వయసులోనే అన్నియన్ చిత్ర పోస్టర్‌ను ఇంటిలోని ఒక అరలో పెట్టుకున్నానని చెప్పింది.ఆ చిత్రంలో రోమో పాత్ర చాలా ఇష్టం అన్నారు. అలాంటిదిప్పుడు ఈ చిత్రంలో విక్రమ్‌తో నటించడం సంతోషంగా ఉందని అంది. దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ సామి స్క్వేర్ చిత్రంలో అమ్మ పాట చోటు చేసుకుంటుందన్నారు. తాను ఇంతకు ముందు ఒక తెలుగు చిత్రంలో నాన్న పాటకు బాణీలు కట్టానన్నారు. అప్పుడే అమ్మకు సంబంధించిన పాటను రూపొందించాలన్న కోరిక కలిగిందని చెప్పారు. అది ఈ చిత్రం ద్వారా తీరిందని అన్నారు. చిత్ర హీరో విక్రమ్ మాట్లాడుతూ దర్శకుడు హరి గురించి చెప్పాలంటే ఆయన దర్శకత్వాన్ని ఒక తపంలా అవిశ్రాంతిగా చేస్తారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సామి చిత్రం తనను కమర్శియల్ హీరోగా నిలబెట్టిందన్నారు. ఈ చిత్రంలో ఒక పాట పాడించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment