
సదుర అడి–3500 షూటింగ్ పూర్తి
సదుర అడి–3500 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ధృవంగళ్–16 వంటి ఘనవిజయం సాధించిన చిత్రం తరువాత నటుడు రఘుమాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం సదుర అడి–3500.
సదుర అడి–3500 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ధృవంగళ్–16 వంటి ఘనవిజయం సాధించిన చిత్రం తరువాత నటుడు రఘుమాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం సదుర అడి–3500. కన్నడ నటుడు అకాశ్, నిఖిల్, ఇనియ, కోవైసరళ, ఎంఎస్.భాస్కర్, మనోబాల, తలైవాసల్ విజయ్, ప్రతాప్‌పోతన్, పరవై మునియమ్మ, దర్శకుడు శరవణసుబ్బయ్య, స్వాతిదీక్షిత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రైట్ వ్యూ సినిమాస్ పతాకంపై జైసన్ జోసఫ్, ఎన్‌ఆర్‌ఎంలు నిర్మిస్తున్నారు.
స్టీఫెన్ దర్శకత్వం వహిస్తున్న దీనికి గణేశ్‌రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే కొన్ని యాథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం సదుర అడి–3500 అని తెలిపారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? మనిషి మరణించిన తరువాత అతని ఆత్మ ఎటు పయనిస్తుంది? లాంటి విషయాలను క్షణ్ణంగా పరిశోధించి విభిన్న కథ, కథనాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని అన్నారు.
హారర్, కామెడీ, లవ్, యాక్షన్ అంటూ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బెంగళూర్, సాలకుడి, చెన్నై చివారు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణను త్వరలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు.