
ఏ పిల్లా నన్ను పట్టించుకోలేదు!
తొలి సినిమాతోనే సత్తాను చాటారు సాయిధరమ్‌తేజ్. డాన్సుల్లో, ఫైటుల్లో తనదైన ప్రతిభను ఆవిష్కరించారు. ‘బాయ్ నెక్ట్స్ డోర్ అనిపించేలా ఉన్నాడే...’ అని అందరితో అనిపించారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయం తన జీవితంలో ఎంత మార్పు తెచ్చినా... తాను మాత్రం సామాన్యుడినేననీ, వ్యక్తిత్వంలో మార్పు రాదనీ ఘంటాపథంగా చెబుతున్న యువ హీరో సాయిధరమ్‌తేజ్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
తొలి సినిమా విడుదల ఆలస్యమవ్వడం, మలి సినిమా ముందు రిలీజవ్వడం... ఈ మధ్యలో ఏమైనా సంఘర్షణకు గురయ్యారా?
అవును... అయితే, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదల్లేదు. ‘రేయ్’ నిర్మాణంలో ఉన్నప్పుడే ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ప్రతిపాదన వచ్చింది. కథ నచ్చి, ‘ఓకే’ చేశాను. రవికుమార్ చౌదరి నాకు ఏదైతే చెప్పారో, అదే తీశారు. కొంతమంది అడిగారు... జగపతిబాబు పాత్రను హైలైట్ చేయడానికి మీ పాత్ర తగ్గించారా అని. అలాంటిదేం జరగలేదు. కథను కథగా తీశారంతే. ఈ విజయానికి కారణం కూడా అదే.
‘పిల్లా... నువ్వు లేని జీవితం’ విడుదలయ్యాక మీకు దక్కిన గొప్ప ప్రశంస?
‘కంగ్రాట్స్... నీ సినిమా విడుదల ఖాయమైంది..’ అని తొలుత ఎవరు చెప్పారో... అదే నాకు గొప్ప ప్రశంస. విడుదలయ్యాక ఎన్ని ప్రశంసలొచ్చినా అవన్నీ దాని తర్వాతే.
చిరంజీవి ఏమన్నారు?
రిలీజ్‌కి ముందే మామయ్య సినిమా చూశారు. ఆయనకు బాగా నచ్చింది. నిన్ననే మళ్లీ ఆయన్ను కలిశాను. భుజం తట్టి అభినందించారు. ‘ఇక ప్రతి క్షణం కష్టపడాలి.. బీ కేర్‌ఫుల్’ అని హెచ్చరించారు. బన్నీ, వరుణ్‌తేజ్, అరవింద్‌గారు.. అందరూ ఈ సినిమా విషయంలో హ్యాపీ.
ఇంతకీ ఈ పాత్ర కోసం మీరు ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు?
నా తొలి సినిమా ‘రేయ్’లో జమైకాలో పెరిగిన తెలుగబ్బాయి పాత్ర నాది. వెస్టిండీస్ బాడీ లాంగ్వేజ్... వారి బిహేవియర్ ఆ పాత్రలో కనిపించాలి. దాని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. చాలా మంచి పాత్ర. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాకొచ్చేసరికి తొలి సినిమాకు పూర్తి భిన్నమైన పాత్ర. పక్కింటి కుర్రాడిలా అనిపించేలా ఉంటుంది. తెలివైన కుర్రాడు. ఏది చేసినా కాన్ఫిడెంట్‌గా, క్లారిటీగా చేస్తాడు. ఆ పాత్రకు తగ్గట్టు మారిపోవడానికి మళ్లీ చాలా కష్టపడాల్సి వచ్చింది.
అది సరేకానీ... హీరో అవ్వాలనే కోరిక చిన్నప్పట్నుంచీ ఉండేదా?
చిరంజీవిగారి లాంటి గ్రేట్ సూపర్‌స్టార్ నా మామయ్యే అయినా... నా దృష్టి మాత్రం ఎప్పుడూ చదువు మీదే ఉండేది. ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవుదామనుకున్నాను. ఎంసెట్ కూడా రాశాను. అయితే... చివర్నుంచి రెండో ర్యాంక్ వచ్చింది(నవ్వుతూ). తర్వాత బీఎస్సీ బయో టెక్నాలజీ చేరాను. థర్డ్ ఇయర్ కెమిస్ట్రీ-3 పేపర్ గుండెపోటు తెప్పించినంత పనిచేసింది. ఇలా కాదని ఎంబీఏలో చేరాను. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్‌ని కావడంతో ఎకౌంట్స్ ఏమీ అర్థం కాలేదు. పిచ్చెక్కినంత పనైంది. నిస్పృహ వచ్చేసింది. ఆ టైమ్‌లోనే నా మైండ్‌సెట్‌లో మార్పొచ్చింది. నైన్ టు సిక్స్ జాబ్‌లో నన్ను నేను ఊహించుకోలేకపోయాను. ఎందుకో ఓ రోజు రాత్రి అనిపించింది... ‘యాక్టర్‌ని అయితే తప్పేంటి?’ అని. హీరోని కావాలని మాత్రం అనుకోలేదు. నా మనసులో మాటను కల్యాణ్ మామయ్య (పవన్‌కల్యాణ్)కి చెప్పాను. వెరీగుడ్.. అని పెద్ద మామయ్య (చిరంజీవి)కు, చిన్నమామయ్య (నాగబాబు)కు చెప్పారు. చివరకు నా బంతి అమ్మ కోర్టులో పడింది. ‘నువ్వు ముందు ఎంబీఏ పూర్తి చెయ్. తర్వాత యాక్టింగ్’ అంది. అమ్మ మాట ప్రకారం ఎంబీఏ పూర్తి చేసి ఇటొచ్చేశా.
ఇంతకీ హీరో అవడానికి ఎలాంటి వర్కవుట్లు చేశారు?
135 కిలోల బరువుండేవాణ్ణి. సగం పైగా తగ్గాను. చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం పెద్ద హెల్ప్ అయ్యింది. అమ్మ క్లాసికల్ డాన్సర్. అమ్మ డాన్స్ చూస్తుండటం వల్ల... నాకు కూడా నాట్యం తేలిగ్గా అబ్బింది. మామయ్యల ప్రభావం ఎలాగూ ఉంటుంది. వైజాగ్ సత్యానంద్, ముంబయ్ బ్యారీజోన్, హైదరాబాద్ భిక్షు, అరుణ భిక్షుగార్ల వద్ద నట శిక్షణ పొందా.
సినిమాలో అల్లరి అల్లరి చేశారు. మరి రియల్ లైఫ్‌లో?
ఇంకా ఎక్కువ ఉంటుంది.
‘పిల్లా నువ్వు లేని జీవితం’ అంటూ మీరు ఎప్పుడు ఆడపిల్లల వెంటపడ్డారు?
ఆహా... చాలామంది వెంటపడ్డాను. ఇంత లావుగా ఉండి మా వెంట పడతాడేంటి? అనుకునేవారు. ‘నిన్ను బోయ్‌ఫ్రెండ్‌గా ఊహించుకోలేకపోతున్నాం’ అన్నవాళ్లే ఎక్కువ. నేనూ అందరిలాంటి కుర్రాణ్ణేనండీ.
ఇంతకీ మీ ఫ్యామిలీలో మీకు ఎవరు బాగా క్లోజ్?
వరుణ్‌తేజ్.. వాడి టాలెంట్ నాకు తెలుసు. అయితే కెమెరా ముందు ఏంటో తెలీదు. మొన్ననే టీజర్ చూశా. అదిరిపోయింది. వాడు పెద్ద స్టార్ అవుతాడని నా నమ్మకం.
హీరో అయ్యాక మార్పు?
ఇప్పుడు వేసుకున్న చొక్కాకంటే రేపు ఖరీదైన చొక్కా వేసుకుంటానేమో! మారిన పరిస్థితులు నన్ను ఎప్పటిలా ఉండనీయవేమో! మొన్నటివరకూ ఇష్టమైన చోట చాయ్ తాగేవాణ్ణి. ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోచ్చేమో! కానీ.. వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రానీయను. నాలో జనాలు చూసేది నా మామయ్యలనే.
- బుర్రా నరసింహ