
ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యా
‘‘ఒక భయంతో తేజూ కెరీర్ మొదలుపెట్టాడు. ఇంత సక్సెస్‌ఫుల్ అయినా ఆ భయం అలాగే ఉంది. దాన్ని ఆలాగే పెట్టుకో తేజ్. ఆ భయం ఉన్నంతకాలం ఎప్పుడూ ఇలా కష్టపడుతూ ఉంటావ్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నీ ప్రతిభకి, కష్టపడే తత్వానికి ఇంకా ఎత్తుకు వెళ్తావ్. ఎన్ని తిక్కలకు ఓ లెక్క ఉంటుందో తెలీదు గానీ, ఈ తిక్కకు మాత్రం తప్పకుండా ఓ లెక్క ఉంటుందని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా నటీనటులుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘తిక్క’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని వంశీ పైడిపల్లి ఆవిష్కరించి, సాయిధరమ్ తేజ్‌కి అందించారు. జానారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ‘‘చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఆశీర్వాదాలతోనే మీ అందరి (అభిమానులు) ప్రేమను పొందగలుగుతున్నాను.
వాళ్లు లేకుండా నేను లేను. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ ఉంటుంది. మనకు ఎప్పుడూ ఉండేది బ్రేకప్ (నవ్వుతూ) కాబట్టి ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ఎక్కడా రాజీ పడకుండా రోహిణ్ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ బాగా తీశారు. తమన్ మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఫ్లాప్ దర్శకుణ్ణి అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజూ, నిర్మాత రోహిణ్‌లకు థ్యాంక్స్’’ అని సునీల్ రెడ్డి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘చిన్నప్పట్నుంచి మెగా ఫ్యామిలీ అంటే అభిమానం. తేజూతో ఈ చిత్రం తీస్తుంటే నా బ్రదర్‌తో వర్క్ చేసినట్టు అనిపించింది. మా చిత్రంలో పాటలు పాడిన ధనుష్, శింబులకు థ్యాంక్స్. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్, మాగంటి గోపీనాథ్, కె.ఎస్.రామారావు, ‘దిల్’ రాజు, నందినీ రెడ్డి, తమన్ తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.