పట్టభద్రురాలైన హీరో కుమార్తె
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సరా అలీ ఖాన్(22) పట్టభద్రురాలైంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు, డిజైనర్ సందీప్ ఖొస్లా తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే డ్రెస్ లో ఆమె ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తండ్రి మాట ప్రకారం ఆమె డిగ్రీ పూర్తి చేసింది. అంతకుముందు బాలీవుడ్ నిర్మాణ సంస్థలను ఆమె హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ముందుకు వచ్చినా సైఫ్ అలీఖాన్ ఒప్పుకోలేదు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే దాకా సినిమాల్లోకి రావొద్దని తండ్రి చెప్పడంతో ఆమె చదువుకు ప్రాధాన్యం ఇచ్చింది. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కుమార్తె అయిన 22 ఏళ్ల సరా త్వరలోనే తెరంగ్రేటం చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 1991లో సైఫ్, అమృత పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత 2004లో విడిపోయారు. తర్వాత కరీనా కపూర్ ను సైఫ్ పెళ్లాడాడు.