‘‘స్టార్ హీరోయిన్.. స్టార్‌డమ్..నటనలో హీరోలని డామినేట్ చేస్తున్నారు...వంటి వాటి గురించి నేను ఆలోచించను. ప్రేక్షకులకు అలా అనిపిస్తుందేమో? నా వరకూ నా పాత్రకి 100శాతం న్యాయం చేయాలని మాత్రమే ఆలోచిస్తా’’ అని సాయిపల్లవి అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న విశేషాలు...
► ‘ప్రేమమ్, ఫిదా, పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో ప్రేమించడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం వంటి పాత్రలు చేశారని అడుగుతున్నారు. ఆ విషయం నేను ఆలోచించనే లేదు. నా తర్వాతి సినిమాలో అలాంటి పాత్ర లేకుండా చూసుకుంటా (నవ్వుతూ). అయితే ప్రతి స్టోరీలో ఎంతో కొంత ప్రేమ కథ ఉంటుంది. అది కామన్ కదా.
► నేను నటించిన ‘పడి పడి లేచె మనసు, మారి 2’ సినిమాలు ఒకే రోజు విడుదలవడం సంతోషంగా ఉంది. ‘పడి పడి లేచె మనసు’ లో డాక్టర్‌గా నా పాత్ర కూల్‌గా ఉంటుంది. ‘మారి 2’లో ఆటో డ్రైవర్‌గా రఫ్‌గా, మాస్‌గా ఉంటుంది.
► ‘పడి పడి లేచె మనసు’ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం కోల్‌కత్తాలో జరిగింది. నేను కోల్‌కత్తాకి వెళ్లడం అదే ఫస్ట్ టైమ్. హనుగారు ఈ కథ చెప్పినప్పుడు హార్ట్‌ఫుల్‌గా ఫీలయ్యా. సినిమాను తెరపై చూసుకున్నప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది.
► ఈ సినిమాలో నాకు, శర్వాకి మంచి కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు. ఆ పాత్రల్లో మేము కాదు.. సూర్య, వైశాలి మాత్రమే కనిపిస్తారు. శర్వా మంచి సహనటుడు. చక్కగా మాట్లాడతాడు. మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎటువంటి ఈగోలు మాకు లేవు. అందుకే ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చాయి. హనుగారు చాలా హార్డ్ వర్కర్. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ సినిమా గురించే ఉంటాయి.
► వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. ఓ 20ఏళ్ల తర్వాత కూడా ‘ఆ అమ్మాయి బాగా నటించింది’ అంటే చాలు. డాక్టర్ వృత్తిని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చా. నా సినిమాలు, నా పాత్రలు చూసినప్పుడు నా తల్లిదండ్రులు సంతోష పడటంతో పాటు గర్వపడాలి. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. చిట్టి పొట్టి డ్రెస్సులు నాకు అంత కంఫర్ట్‌గా ఉండవు. అందుకే వాటికి దూరం. ‘ఫిదా’ సినిమాలో ఓ సన్నివేశంలో అవసరం కాబట్టి వేసుకోక తప్పలేదు (నవ్వుతూ).
► సినిమాల్లో నా పాత్రలో లవ్.. బ్రేకప్స్ ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా అయితే ప్రస్తుతానికి లేవు. స్కూల్ డేస్‌లో అబ్బాయిలు నావైపు చూసేవారు కానీ ధైర్యంగా మాట్లాడేవారు కాదు. నా మొహంపైన అప్పుడు కూడా మొటిమలు ఉండేవి. అయినా అబ్బాయిలు చూస్తున్నారంటే నాకు సంతోషంగా అనిపించేది. కాలేజ్ డేస్‌లో ప్రేమలో పడే టైమ్‌లేదు. పుస్తకాలతో ప్రేమలో పడిపోయా. ఇప్పుడు నా ప్రేమ సినిమాలతోనే. అవును.. సినిమాలతో ప్రేమలో ఉన్నా (నవ్వుతూ). నిజ జీవితంలో సహజీవనం చేయాలనుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటా. సహజీవనం గురించి నేను తప్పుగా మాట్లాడటంలేదు. ఎవరిష్టం వారిది.
► నేను బయట ఎక్కడైనా కనిపిస్తే సాయిపల్లవి అనడం లేదు.. భానుమతి అంటున్నారు. అంతలా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇదొక బాధ్యతగా భావించి, ప్రాధాన్యం ఉన్న, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడలేను. ఇప్పుడిలా మాట్లాడుతున్నానంటే కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ములగారు, భానుమతి పాత్రే కారణం. నేను టైమ్‌కి షూటింగ్ రాననడం కరెక్ట్ కాదు. టైమ్‌కి సెట్‌లో ఉంటా. హిట్టు, ఫ్లాపు అనేది పెద్దగా మైండ్‌కి ఎక్కించుకోను. మన ప్రయత్న లోపం ఉండకూడదనుకుంటా. ఆ తర్వాత దేవుడి, ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రిజల్ట్ ఏదైనా మన మంచికే అనుకుంటాను.
► నేనెప్పుడూ హీరోయిన్‌గా ఫీలవ్వను. ఓ సాధారణ అమ్మాయిలానే ఉంటా. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్, బంధువులు కూడా నన్ను హీరోయిన్‌గా ట్రీట్ చేయరు. ఇంట్లో నా పనులు నేనే చేసుకుంటా. కమర్షియల్ యాడ్స్ చేయడం ఇష్టం ఉండదు. చారిటీ కార్యక్రమం అయితే డబ్బులు తీసుకోకుండా చేస్తా.
► తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఓ సినిమాకి చర్చలు జరిగాయి. ఇంకా సైన్ చేయలేదు. ఇందులో అందరూ అనుకుంటున్నట్లు నాది నక్సలైట్ పాత్ర అయితే కాదు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో సూర్యతో ‘ఎన్‌జీకే’ మూవీలో నటిస్తున్నా.
ప్రేమలో ఉన్నా
Published Sun, Dec 23 2018 3:14 AM | Last Updated on Sun, Dec 23 2018 8:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment